మూడున్నర కోట్లకు పైగా జనాభా కలిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దేశ రాజధాని శాసనసభ ఎన్నికలు మూడు పర్యాయాలు వరుసగా అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్)కి, పాతికేళ్లకు పైగా అధికారానికి దూరంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
కేంద్రంలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం కొరకరాని కొయ్యగా తయారయ్యాయి. 1993- 1998 మధ్య ఢిల్లీని ఏలిన బీజేపీకి మరోసారి ఆ పీఠం అందని ద్రాక్షలా తయారయ్యింది. ఫిబ్రవరి 5న జరిగే శాసనసభ ఎన్నికలకు సంబంధించి ‘పీపుల్స్ పల్స్’ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే బీజేపీ అవకాశాలపై పలు ఆసక్తికరమైన అంశాలు వెలువడ్డాయి.
పాతికేళ్లుగా అధికారానికి దూరం
ఢిల్లీలో బీజేపీకి బలం ఉన్నప్పటికీ 25 సంవత్సరాలకుపైగా రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉంది. రాజధాని ఓటర్లు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇస్తున్నారు. ఢిల్లీ ఓటర్లు 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాల్లో బీజేపీని గెలిపించినా శాసనభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీని కరుణించడం లేదు. 1998 డిసెంబర్లో అధికారం కోల్పోయిన బీజేపీ మళ్లీ ఇప్పటి వరకు గెలుపు బాట పట్టలేదు.
1998-2013 వరకు మూ డు సార్లు వరుసగా కాంగ్రెస్ చేతిలో ఓడిన బీజేపీ, 2013 నుండి వరుసగా ఆప్ చేతిలో భంగపాటుకు గురవడంతో ఢిల్లీలో పాతికేళ్లకుపైగా ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతోం ది. బలమైన కేడర్‌తో పార్టీ పటిష్ఠంగా ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురవుతున్న పరాజయాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని సర్వశక్తులతో ప్రయత్నిస్తున్న బీజేపీకి క్షేత్రస్థాయిలో ఎంత బలముందో, అన్ని బలహీనతలు కూడా ఉన్నాయి.
ప్రతిపక్షానికే పరిమితం
2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ రాజకీయాల్లో కీలకమైనవి. ఈ ఎన్నికల్లో 32 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ మెజార్టీకి 4 స్థానాల దూరంలో నిలిచింది. ఆ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆప్ 28 స్థానాల్లో గెలిచి 8 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల తర్వాత ఆప్ వరుసగా గెలుస్తుండగా, బీజేపీ ప్రతిపక్ష పార్టీ పాత్రకు పరిమితమైంది. మరోవైపు కాంగ్రెస్ ఉనికికే ప్రమాదం ఏర్పడింది.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన బీజేపీ అనంతరం ఘోరపరాజయా లను మూటగట్టుకుంది. ప్రాంతీయ పార్టీ ఆప్ ముందు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కొట్టుకుపోయాయి. 2015లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 3 స్థానాలు, 2020లో జరిగిన ఎన్నికల్లో 8 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలవగా, కాంగ్రెస్ రెండు ఎన్నికల్లోనూ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది.
2015 నుండి ఢిల్లీలో ఆప్ సునామీ ప్రారంభమైనా అది అసెంబ్లీ ఎన్నికలకే పరిమితమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి తిరుగులేకుండా ఉంది. ఈ పరిణామాలు పరిశీలిస్తే ఢిల్లీలో బీజేపీ పటిష్ఠంగా ఉన్నా, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తేలిపోతోందని స్పష్టమవుతుంది.
2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకుంది. ఏడు లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాలను పరిశీలిస్తే మొత్తం 70 అసెంబ్లీ సెగ్మెంట్లలో 52 చోట్ల బీజేపీకి ఆధిక్యత వచ్చింది. ఈ గణాంకాలను బట్టి అవే ఫలితాలు శాసనసభ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని బీజేపీ భావిస్తున్నా, 2019లో కూడా ఏడు ఎంపీ సీట్లు గెలిచినా 2020లో 8 స్థానాలకే పరిమితమవడం బీజేపీలో గుబులు రేపుతున్నాయి.
ఆప్ అవినీతిపైనే ఆశలు
ప్రధాని నరేంద్ర మోదీ గత వారం ఢిల్లీలో ‘పరివర్తన్ ర్యాలీ’ నిర్వహించి ‘ఆప్దా నహీ సహేంగే, బదల్ కర్ రహేంగే’ (విఫలమైన ఆప్‌ని ఇక సహించేది లేదు, మార్పు తీసుకొద్దాం) అని పిలుపినిచ్చారు. ప్రధానంగా ఆప్ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు లాభిస్తాయనే ఆశతో బీజేపీ ఉంది. లిక్కర్ స్కాంతో ఆప్ ఛీప్ కేజ్రీవాల్ జైలుకెళ్లడంతో పాటు శీష్‌మహల్ అవినీతి అంశాన్ని కూడా అస్త్రాలుగా చేసుకుంది బీజేపీ.
అంతేకాక ఢిల్లీలో తాగు నీటి కొరత, పాడైన రహదారులు, ప్రజా రవాణాలో సమస్యలతో పాటు ఆప్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి అనుకూలించే అంశాలుగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా విఫలమైన ఆప్ ఎమ్మెల్యేలపై చార్జిషీట్లు విడుదల చేస్తూ బీజేపీ ప్రచారం చేస్తుంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు సంఫ్‌ు పరివార్ అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఢిల్లీలోని పలు కాలనీల్లో, మురికివాడ ప్రాంతాల్లో పర్యటిస్తూ వెయ్యికిపైగా చిన్న చిన్న సమావేశాలను నిర్వహించి ప్రజలకు చేరువవడం బీజేపీకి లాభించవచ్చు.
స్థానికంగా పటిష్ఠమైన కేడర్, నాయకులు ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌తో సరితూగే బలమైన నేత ఒక్కరూ పార్టీలో లేకపోవడం బీజేపీలో ప్రధానమైన బలహీనత. ఏడుగురు ఎంపీలున్నా బీజేపీ ఇప్పటికీ 12 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేకపోయింది. తొలి విడత జాబితాలో ఆ పార్టీ బరిలోకి దింపిన 29 మంది అభ్యర్థుల్లో 8 మంది ఇతర పార్టీల నుండి వచ్చిన వారే. అంతేకాక పలు నియోజకవర్గాల్లో బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు, నేతల ఆధిపత్య పోరు కూడా పార్టీకి ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
మరోవైపు పలు సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలను ప్రధానంగా మహిళలను ఆకర్షిస్తూ వివిధ పథకాలను అమలు చేస్తున్న ఆప్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఊపు మీదుంది. ఎన్నికల సందర్భంగా మరికొన్ని ప్రకటించింది. దీనికి బదులుగా ప్రజాకర్ష సంక్షేమ పథకాలను ప్రకటించడంలో బీజేపీ విఫలమవుతోంది. తాము అధికారంలోకి వస్తే ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయని చెప్పడం తప్ప, వారు ప్రత్యేకంగా ప్రవేశపెట్టే వాటి గురించి పెద్దగా చెప్పలేకపోతుంది.
మహిళల్లో ఆప్‌కున్న ఆదరణను తగ్గించడంలో విఫలమవుతున్న బీజేపీకి ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు మరింత తలనొప్పి తెస్తున్నాయి. బీజేపీ మాజీ ఎంపీ, ఆప్ ముఖ్యమంత్రి అతిషికి వ్యతిరేకంగా బరిలోకి దిగిన రమేష్ బిధూరి తాను ఒక మహిళా అభ్యర్థిపై పోటీ చేస్తున్నాననే సోయి కూడా లేకుండా కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీపై అసభ్యకరంగా మాట్లాడడం పార్టీకి నష్టం కలిగించాయి.
ఆ 20 స్థానాల్లో ఎదురీత
ఢిల్లీలో ఉన్న 12 రిజర్వుడ్ స్థానాలతో పాటు మైనార్టీలు నిర్ణయాత్మకంగా ఉన్న 8 స్థానాల్లో కూడా బీజేపీ బలహీనంగా ఉంది. మొత్తం ఈ 20 స్థానాల్లో బీజేపీ 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవలేదు. దశాబ్దకాలంపైగా ఆప్ పాలనలో ఢిల్లీ ప్రజలు విసిగిపోయారని, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న తమకు ఈ సారి అధికారం ఖాయమని బీజేపీ కలలు కంటున్నా, కాలనీలలో, మురికివాడల్లో, మైనార్టీ సామాజిక వర్గం ఓటర్లు ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో, దిగువ మధ్య తరగతి ప్రజలుండే ప్రాంతాల్లో ఆప్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కేజ్రీవాల్‌పై ఇప్పటికీ ఆదరణ ఉందని పీపుల్స్ పల్స్ బృందం దృష్టికి వచ్చింది.
70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 36 కోసం నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్న బీజేపీ, ఆప్ పార్టీలు కాంగ్రెస్‌తో ఆందోళన చెందుతున్నాయి. షీలా దీక్షిత్ 15 ఏళ్ల పాలన తర్వాత 2013 నుండి క్షేత్రస్థాయిలో పూర్తిగా బలహీన పడ్డ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమాత్రం లేకపోయినా, ఆ పార్టీ పలు చోట్ల గెలుపోటములను ప్రభావితం చేయవచ్చు. మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలిస్తే బీజేపీకి, మైనార్టీ, ఎస్సీ ఓట్లను చీలిస్తే ఆప్‌కు నష్టం కలిగే అవకాశాలున్నాయి.
పాతికేళ్లకుపైగా హస్తినలో అధికారం కోసం వేచి చూస్తూ ‘పరివర్తన’ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ నిరీక్షణ 2025లో తీరనుందా..? ఆ పార్టీ కల నెరవేరుతుందా..? ఢిల్లీ పీఠం దక్కుతుందా..? అనే ప్రశ్నలకు సమాధానం ఫిబ్రవరి 8న వెలువడే ఫలితాలే తేల్చనున్నాయి.
వ్యాసకర్త సీనియర్ రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.