calender_icon.png 8 October, 2024 | 5:09 AM

టీడీపీలో చేరతా!

08-10-2024 02:54:18 AM

తీగల కృష్ణారెడ్డి ప్రకటన

ఏపీ సీఎం బాబుతో భేటీ

భేటీలో ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి కూడా.. 

రంగారెడ్డి, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ‘నేను త్వరలో టీడీపీలో చేరతా. పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా’ అని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు.

చంద్రబాబుతో భేటీ అయి అనంతరం బయటకు వచ్చారు. ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. మరోసారి చంద్రబాబును కలిసి పార్టీలో చేరికకు సం బంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తానని వెల్లడించారు. తనతో పాటు తన అనుచరు లు, ఎంతో మంది కార్యకర్తలు కుడా టీడీపీలో చేరతారన్నారు.

టీడీపీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధికి అడుగులు పడ్డాయ ని, నాటి సీఎం చంద్రబాబు విజన్‌తోనే అది సాధ్యమైందని కొనియాడారు. ఏపీకి మళ్లీ చంద్రబాబు సీఎం కావడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. తెలంగాణలో ఇప్పటికీ లెక్కలేనంత మంది టీడీపీ అభిమానులు ఉన్నారని, వారందరినీ ఏకతాటి పైకి తీసుకొస్తానన్నారు. మళ్లీ రాష్ట్రంలో ఎన్టీఆర్ పాలన రావాల్సి ఉందన్నారు.

కానీ తీగల ప్రతిపాదనపై చంద్రబాబు ఎలాంటి హామీ ఇచ్చారనే విషయాన్ని మాత్రం ఆయన బయటకు చెప్పలేదు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా చంద్రబాబు యోచిస్తున్నారని ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో పాత నేతలంతా మళ్లీ టీడీపీ బాటపడతారని ప్రచారం సాగుతోంది.

తొలి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తీగల

తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డి టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్య ర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్  అభ్యర్థి  మల్‌రెడ్డి రంగారెడ్డిపై  30 వేల మెజార్టీ గెలుపొందారు. కొద్దికాలం తర్వాత టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఆయన గులాబీ గూటికి చేరారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రె స్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతి లో ఓటమిపాలయ్యారు. రాజకీయ పునరేకరణలో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్ సబి తా ఇంద్రారెడ్డిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నా రు. తర్వాత ఆమెను విద్యాశాఖ మంత్రిని చేశారు.

అప్పటి నుంచి మహేశ్వరం నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గాన్ని  సృష్టిం చుకుని రాజకీయాలు చేస్తున్నప్పటికీ, సబితా టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయన చిన్నబుచ్చుకున్నారు. గత  స్థానిక సంస్థల ఎన్నికల్లో మహేశ్వరం జడ్పీటీసీగా తీగల కోడలు అనితారెడ్డి గెలిచారు. బీఆర్‌ఎస్ అధిష్ఠానం ఆమెకు రంగారెడ్డి జడ్పీచైర్‌పర్సన్ పదవిని సైతం కట్టబెట్టింది.

తర్వాత తీగల బీఆర్‌ఎస్ నుంచి మహేశ్వరం టికెట్ ఆశించి భంగపడ్డారు. తర్వాత తన కోడలు అనితతో కలిసి దీపదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో తన వర్గానికి పెద్దగా ప్రాధాన్యత లేదని భావించి తీగల సైలెంట్ అయ్యారని తెలుస్తున్నది.

మళ్లీ తన కోడలు అనితను జడ్పీచైర్మన్ చేయాలనే డిమాండ్‌తో తీగల ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతి పాదనకు కాంగ్రెస్ అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేయకపోవడంతోనే ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.

మనవరాలి పెండ్లి పత్రిక ఇచ్చేందుకు వచ్చా: మల్లారెడ్డి

ఏపీ సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తీగలతో పాటు మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి కూడా టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు మల్లారెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదు. తన మనవరాలి పెళ్లికి చంద్రబాబును ఆహ్వానించి కార్డు ఇచ్చానని, ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని మల్లారెడ్డి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.