calender_icon.png 6 November, 2024 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయం దక్కేనా?

03-11-2024 12:00:00 AM

  1. పంత్ అర్థసెంచరీ
  2. భారత్, న్యూజిలాండ్ మూడో టెస్టు
  3. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 171/9 n టీమిండియా 263 ఆలౌట్

గిల్ శతకం మిస్.. 

* న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా మూడో టెస్టులో మాత్రం విజయం దిశగా అడుగులు వేస్తోంది. స్పిన్నర్లకు విపరీతంగా అనుకూలిస్తోన్న పిచ్‌పై భారత స్పిన్నర్లు చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ కుదేలయ్యింది. ఆలౌట్‌కు వికెట్ దూరంలో ఉండడంతో భారత్ ముందు 150 పరుగుల సాధారణ టార్గెట్ ఉండే చాన్స్ ఉంది. జాగ్రత్తగా ఆడితే విజయం టీమిండియాదే.

163 - వాంఖడే వేదికగా జరిగిన టెస్టులో అత్యధిక పరుగుల ఛేదన సౌతాఫ్రికా (163) పేరిట ఉంది.2000 ఫిబ్రవరిలో భారత్ విధించిన టార్గెట్‌ను సఫారీలు 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

న్యూఢిల్లీ: టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా మారింది. టెస్టు సిరీస్ కోల్పోయినప్పటికీ ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు భారత్‌కే ఎక్కువగా ఉన్నాయి.

ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఎజాజ్ పటేల్ క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు తీయగా.. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్ (51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. గ్లెన్ ఫిలిప్స్ (26) పర్వాలేదనిపించాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు తొలి సెషన్ ఆరంభంలోనే కివీస్ చేతిలో ఉన్న ఒక్క వికెట్‌ను పడగొడితే భారత్ ముందు 150 లోపే టార్గెట్ ఉండొచ్చు. స్పిన్‌కు విపరీతంగా అనుకూలిస్తున్నప్పటికీ జాగ్రత్తగా ఆడితే టీమిండియా విజయం నల్లేరు మీద నడకే.

గిల్ సెంచరీ మిస్..

86/4 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు పంత్, గిల్ శుభారంభం అందించారు. నిలకడగా ఆడిన గిల్ (90) ఎజాజ్ పటేల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరి 10 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మరోవైపు పంత్ మాత్రం ధాటిగా ఆడాడు. 36 బంతుల్లోనే అర్థసెంచరీ మార్క్ అందుకున్న పంత్ (60) సోదీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

ఐదో వికెట్‌కు ఈ ఇద్దరు కలిసి 96 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ డకౌట్‌గా వెనుదిరగ్గా.. జడేజాతో కలిసి సుందర్ (38 నాటౌట్) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. జడేజా (14), అశ్విన్ (6), ఆకాశ్ దీప్ (0) వెనుదిరగడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.

దీంతో టీమిండియాకు 28 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. కివీస్ బౌలర్లలో ఎజాజ్ పటేల్ 5 వికెట్లు పడగొట్టాడు.  అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. ఒక దశలో 94/3తో పటిష్టంగా కనిపించిన కివీస్ 87 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది.