calender_icon.png 3 April, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక అక్రమ రవాణా ఆగేనా?

31-03-2025 12:00:00 AM

-16 ఇసుక రీచ్ లను గుర్తించి ఉపయోగం ఏంటి ?

-అందరికీ సమన్యాయం చేస్తూ దర్జాగా ఇసుక తరలింపు  చేస్తున్న ఇసుక వ్యాపారులు 

-జిల్లాలో మహబూబ్ నగర్, జడ్చర్ల ప్రాంతాల్లో ఇసుకకు ఫుల్ డిమాండ్

మహబూబ్ నగర్ మార్చి 30 (విజయ క్రాంతి) : అసలే ఇసుక సీజన్... నిర్మాణం ఇప్పుడు ఆగిందంటే ఇక వర్షాలు అనతి కాలంలోనే వస్తాయి.... ఇంటినిర్మాణాలతో పాటు మార్చ్ మాసం కావడంతో వివిధ ప్రభుత్వ పనుల సిసి రోడ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. 

ఇప్పుడు నిర్మాణం ఆగింది అంటే ఇంకా ఎప్పుడు అనే ప్రశ్న  నిర్మాణదారుల్లో నెలకొంది. ఇది నిజం కూడా.. ఇదే అదును కావడంతో నిర్మాణదారులు ఇసుక వ్యాపారులకు వరుసగా ధర ఎక్కువైనా పర్వాలేదు ఇసుక తీసుకురండి అంటూ పలువురు ఇంటి యజమానులు ఇసుక వ్యాపారు వ్యాపారులను సంప్రదిస్తున్నారు.

ఎలాగైనా ఇసుకను చేరవేసి డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఇసుక వ్యాపారులు చూస్తున్నారు. ఇందుకు వారి దగ్గర ఉన్న ఆస్త్రాలన్నీ ఉపయోగించి అక్రమ ఇసుక తరలింపుకు ఆజ్యం పోస్తూ అడుగులు వేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు అటువైపు చూడడమే మానేసిండ్రు. 

అధికారుల తీరు ఇలా...

మన ఇసుక వాహనం అనే విధానంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆన్లైన్లో బుక్ చేయడం ద్వారా నేరుగా వారి ఇంటికి ఇసుక చేరుతుంది. ఇది వినేందుకు చాలా అద్భుతంగా ఉంది. కాగా బుక్ చేసుకున్న వారికి మాత్రం కొన్నిసార్లు వారాలు గడిచిన ఇసుక దిగుమతి కాదు. 

అవసరమైన అన్ని ప్రాంతాలకు ఇసుక తరలింపు చేయాలనే ఉద్దేశంతో 2024 నవంబర్ మాసంలో జిల్లా ఉన్నత అధికారులు జిల్లా వ్యాప్తంగా 16 ఇసుక రీచ్ లను గుర్తించారు. ఈ రీచ్ ల ద్వారా ఇసుకను అన్ని ప్రాంతాలకు సరఫరా చేయాలని సంకల్పించి మధ్యలోనే వదిలేశారు. కోయిలకొండ, అడ్డాకుల, మిడ్జిల్, దేవరకద్ర తో పాటు తదితర మండలాల్లో ఇసుక రీచ్ లను గుర్తించినప్పటికీ ఆ రీచ్ లను మాత్రం ఓపన్ చేయడం లేదు.

అధిక శాతం అడ్డాకుల మండలం కన్మనూర్, పొన్నకల్, మిడ్జిల్ మండలం, కొత్తపల్లి ప్రాంతాల్లో మాత్రం మన ఇసుక వాహనం ద్వారా బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించినప్పటికీ చాలామందికి ఇసుక చేరడం లేదు. ఎందుకు రాజకీయ ఒత్తిళ్లు కూడా ప్రధాన కారణంగా ఉన్నట్లు అంతర్లీనంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. అన్ని ఉండి కూడా ఇసుక ఎందుకు అక్రమంగా అవసరమైన వ్యక్తులకు చేరుతుందనే ప్రశ్నకు సమాధానం మాత్రం ఏళ్ల తరబడి లభించడం లేదు.

వాగు ఇసుకకు బేరం 

కోయిలకొండ మండలం మల్లాపూర్ గ్రామంలో మా పొలం కింద వాగు ఉన్న కారణంగా మాకు ఇవ్వాలి.. మా పొలం బాటలో ఇసుక వాహనాలు నడుస్తున్నందుకు మాకు ఎంతో కొంత ఇవ్వాల్సిందే. ఇలా ఒక్కొక్కరు ఒక్కింత ఇస్తూ ఇసుక వ్యాపారులు బేరం కుదుర్చుకున్నారు. బేరం కుదుర్చుకున్నాక అధికారుల అండ దండలు అవసరం అనుకొని వారికి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఇటు రెవెన్యూ, అటు పోలీస్ శాఖల అధికారుల అండదండలతో ఇసుక వ్యాపారం గడిచిన మంగళవారం ఆరంభించి ఇసుకను ఒక దగ్గర పోగు చేశారు. అదే రోజు రాత్రి టిప్పర్ ధర ఇసుకను ఇతర ప్రాంతానికి తరలించేందుకు ఇసుక వ్యాపారులు ప్రయత్నం చేశారు. ఇసుకతో వెళ్తున్న వాహనాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు.

సివిల్ డ్రెస్ లో పోలీసులు సైతం మల్లాపూర్ గ్రామానికి చేరుకొని అడ్డుకున్న వారి నుంచి మూడు సెల్ఫోన్లను తీసుకొని పోలీస్ స్టేషన్లో ఉంచారు. మరుసటి రోజు ఆ గ్రామస్తులు సీఐ గాంధీ నాయక్ ను కలిసి వారి సమస్యను చెప్పారు. దీంతో సీఐ ఆ ఇసుకను సీజ్ సీజ్ చేయడంతో పాటు సెల్ ఫోన్లు తిరిగి ఇవ్వాలని సంబంధిత పోలీసు అధికారులు ఆదేశించడంతో వారికి సెల్ఫోన్లో ఇవ్వడం జరిగింది. దీనితోపాటు డంపు చేసిన ఇసుక దగ్గరికి కోయిలకొండ తాసిల్దార్, ఎస్త్స్ర తిరువూరు మల్లాపూర్ గ్రామానికి చేరుకొని డంపు చేసిన ఇసుకను సీజ్ చేయడం జరిగింది.

కోయిలకొండ మండలం సూరారం తో పాటు పల ప్రాంతాల్లో ఇప్పటికి తాసిల్దార్ అనుమతి తీసుకున్నప్పటికీ నిబంధనల విరుద్ధంగానే అక్రమంగా ఇసుక తరలింపు ఏదైతేంగా జరుగుతుందని స్థానికులే పేర్కొంటున్నారు. అధికారులు పారదర్శకంగా నియమ నిబంధన అమలు చేయకపోవడంతో అక్రమ వైశ్యముగా తరలింపు జరుగుతుంది. 

మిడ్జిల్ లో ఇలా...

శనివారం మధ్యాహ్నం మిడ్జిల్ మండల పరిధిలోని రాణి పేట దగ్గర 12 భారత్ బెంజ్ లలో ఇసుక తరలింపు జరుగుతుందని స్థానిక  నాయకులు ఆ వాహనాలను నిలిపి వేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ వాహనాల దగ్గరికి చేరుకొని కొన్ని అనివార్య కారణాలవల్ల వే బిల్స్ లలో ఒకే నెంబర్ ఉందని ఇసుక తరలింపుకు అనుమతి ఉందని చెప్పడంతో సమస్యను సద్దు మనిగేలా చేయడం జరిగింది.

ఈ విషయంపై జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్ వివరణ కోరగా తాసిల్దార్ నేరుగా వచ్చి అనుమతి ఉందని చెప్పడం జరిగిందని అందులో భాగంగానే ఆ వాహనాలను విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. ఇలా ఘటనలను వెలికి తీస్తే ఇసుక రీచ్లకు సమీపంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ అనుమతి లేకుండానే ఇసుక తరలింపు ప్రక్రియ యదేచ్ఛంగా జరుగుతుంది.

ఈ విషయం అధికారులు అందరికీ తెలిసినప్పటికీ కూడా నివారణ చర్యలు మాత్రం తీసుకోవడం లేదని ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు నూతన విధానాలను అంకురార్పణ చేసి నిర్మాణదారులకు నాణ్యమైన ఇసుక అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.