calender_icon.png 6 March, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెక్షన్ 80డీపై ఈసారైనా పన్ను ఊరట దక్కేనా?

25-01-2025 12:00:00 AM

నిర్మలమ్మ బడ్జెట్‌పై మధ్య తరగతి ఆశలు

న్యూఢిల్లీ:  కుటుంబంలో ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భంలో అందుకయ్యే వైద్య ఖర్చుల నుంచి ఊరట కల్పించేది ఆరోగ్య బీమా. భారీగా పెరిగిన ఈ తరహా ఖర్చుల నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్క కుటుంబానికీ ఆరోగ్య రక్షణ ఉండాల్సిన పరిస్థితి.

దీన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ మినహాయింపు పరిమితి తక్కువగా ఉండటంతో దాన్ని పెంచాలన్న డిమాండ్ అటు సామాన్యులు, ఇటు బీమా కంపెనీలు సైతం కోరుతుండడం గమనార్హం.

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ నుంచి దీన్ని ఆశించడం సరైన డిమాండేనని అంటున్నారు నిపుణులు. ఆరోగ్య బీమా ప్రీమియం కోసం చెల్లించే మొత్తంపై ఆదాయపు పన్ను చట్టంలోని  సెక్షన్  80డి కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. 60ఏళ్లలోపు ఉన్న వ్యక్తి..

తనతో పాటు భార్యాపిల్లల పేరు మీద తీసుకునే పాలసీకి చెల్లించే ప్రీమియంలపై గరిష్ఠంగా రూ.25వేల వరకు మినహాయింపు పొందొచ్చు. అదే 60 ఏళ్లు దాటితే 80డి కింద రూ.50వేల వరకు మినహాయింపు క్లెయిమ్ చేయొచ్చు.

ఒకవేళ తల్లిదండ్రుల పేరిట ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే అదనంగా మరో రూ.25వేలు, వారి వయసు 60 ఏళ్లు దాటితే రూ.50 వేలు చొప్పున ఆదాయపు పన్ను మినహాయింపు పొందొచ్చు. అంటే గరిష్ఠంగా రూ.లక్ష వరకు మినహాయింపు క్లెయిమ్ చేసుకునే సదుపాయాన్ని ఈ  సెక్షన్  80డి కల్పిస్తోంది.

సెక్షన్ 80డి మినహాయింపును చివరి సారిగా 2015 బడ్జెట్‌లో సవరించారు. అప్పట్లో రూ.15వేలుగా ఉన్న మొత్తాన్ని రూ.25వేలకు పెంచారు. సీనియర్ సిటిజన్ల పేరు మీద తీసుకునే బీమాపై మినహాయింపు మొత్తాన్ని 2018లో కేంద్రం సవరించింది. రూ.30 వేల నుంచి రూ.50వేలకు పెంచింది.

అప్పటి నుంచి ప్రతి బడ్జెట్ వైపు దీనికోసం ఆశగా ఎదురుచూస్తోన్న సామాన్యలకు నిరాశే మిగులుతూ వస్తోంది.దేశంలో వైద్యఖర్చులు నానాటికీ భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కొవిడ్ తర్వాత ఈ పరిస్థితి మరీ తీవ్రంగా మారింది. దీంతో ఇప్పుడున్న పరిమితి ఏమాత్రం తమ అవసరాలను తీర్చడం లేదని సామాన్యులు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా చిన్నపిల్లలు, వయో వృద్ధులు ఉన్న వారు ఈ పరిమితి పెంచాలని కోరుతున్నారు. దేశంలో ఇప్పటికీ ఆరోగ్య బీమా పాలసీ లేని కుటుంబాలు బోలెడు. వారందరినీ ఆరోగ్య బీమా పరిధిలో తీసుకురావాలంటే మినహాయింపు మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉందని అటు బీమా కంపెనీలూ చెబుతున్నాయి.