17-12-2024 02:09:52 AM
* లోక్‌సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి
* లిఖితపూర్వక సమాధానమిచ్చిన కేంద్రమంత్రి పంకజ్ చౌదరి
ఖమ్మం, డిసెంబర్ 16 (విజయక్రాంతి): జీవిత, ఆరోగ్య బీమాల ప్రీమియంపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) భారం తగ్గిస్తారా? పన్నుల రూపంలో లాభాపేక్ష లేకుండా వినియోగదారుల పక్షాన ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తారా? అని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
రాష్ట్రాలు కేంద్రం నుంచి ప్రతినిధులతో కూడిన కౌన్సిల్ సిపార్సుల ఆధారంగా జీఎస్టీ రేట్లు, మినహాయింపులు నిర్దేశించినట్టు తెలిపారు. గత సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ సమావేశంలో జీవిత, ఆరోగ్య బీమాపై చర్చించిన అనంతరం కౌన్సిల్ సిఫారసు మేరకు సమగ్ర పరిశీలనకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చాకే బీమా పాలసీలపై స్పష్టత వస్తుందని మంత్రి వివరించారు.