calender_icon.png 19 September, 2024 | 9:49 PM

గ్రూప్-1 సాఫీగా జరిగేనా?

19-09-2024 01:04:40 AM

వెంటాడుతున్న కోర్టు కేసులు

ఒకవేళ రద్దు, వాయిదా పడితే ఎలా?

స్పష్టత వచ్చాకే పరీక్షలు నిర్వహించాలె

ప్రభుత్వం, టీజీపీఎస్సీకి అభ్యర్థుల విజ్ఞప్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణను కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. అసలు ఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేదా అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో  పలువురు అభ్యర్థులు ఇప్పటికే హైకోర్టు మెట్లు ఎక్కారు. దాదాపు 14 పిటిషన్లు దాఖలైనట్లు తెలిసింది.

ఇందులో కొన్ని విచారణకు రాగా, మరికొన్ని త్వరలో విచారణకు రానున్నాయి. టీజీపీఎస్సీ మాత్రం పరీక్షల నిర్వహణకు సమాయత్తం అవుతోంది. ఒకవైపు కోర్టులో కేసులు విచారణ దశలో ఉండగా టీజీపీఎస్సీ అధికారులు పరీక్షలను ఎలా నిర్వహిస్తారని పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఆ కేసులన్నీ ఓ కొలిక్కి వచ్చాకే పరీక్షలను నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేసులు ఇవే..

గ్రూప్-1 నియామక ప్రక్రియకు సంబంధించి దాదాపు 14 కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ కేసుల్లో ప్రధానంగా ఎస్టీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ, ఫైనల్ కీ పై అభ్యంతరాలు, ట్రాన్స్‌జెండర్స్ రిజర్వేషన్ల అమలు, పీహెచ్ రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సవాల్, జీవో నెం.29 సవాల్, స్పోర్ట్స్ కోటాతోపాటు మరికొన్ని అంశాలపై పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. ఫైనల్ కీ విషయంలో ఒకవేళ కోర్టు తీర్పు అభ్యర్థులకు అనుకూలంగా వస్తే మెయిన్స్‌కు ఎంపికయ్యే వారి జాబితా మళ్లీ మారే అవకాశం ఉందని అభ్యర్థులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరొక కేసుకు సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా 503 గ్రూప్ పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేసి, ఆ తర్వాత మరో 60 పోస్టులను కలిపి దరఖాస్తులను స్వీకరించింది. వీటికి కొత్తగా వేలల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరు పెరిగిన 60 పోస్టులకే పోటీ ఉంటారని, 503 పోస్టులకు ఎలా పోటీ అవుతారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా అన్యాయమని కొంతమంది కోర్టు మెట్లు ఎక్కారు.

ఇక స్పోర్ట్స్ కోటా కింద 200 మంది వరకు అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించిన టీజీపీఎస్సీ అందులో ఇద్దరినే ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కూడా కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ 2022లో జారీ చేసిన జీవో నెం.33ను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలా వివిధ కారణాలతో కోర్టు కేసులు గ్రూప్ పరీక్షను వెంటాడుతున్నాయి. 

త్వరలో విచారణకు కేసులు..

తెలిసిన సమాచారం మేరకు పీహెచ్ అభ్యర్థులకు హారిజంటల్ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ నవంబర్ 7న రానుంది. అదేవిధంగా ఈనెల 27న తుది కీకు సంబంధించిన పిటిషన్, జీవో 29 పిటిషన్, అక్టోబర్ 3న మరొక కేసు విచారణకు రానున్నట్లు తెలిసింది. ఇవే కాకుండా మరికొన్ని కేసులు విచారణ దశలోనే ఉన్నాయి. ఇవి కొలిక్కి రాకుండా టీజీపీఎస్సీ పరీక్షలను నిర్వహించాలని చూడడం అన్యాయమంటున్నారు.

కొలిక్కి వచ్చాకే నిర్వహించాలె..

గ్రూప్ ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ జూలైలో ఫలితాలను విడుదల చేసి మెయిన్స్‌కు 31,382 మందిని ఎంపిక చేసింది. దాదాపు 1:57 నిష్పత్తిలో ఎంపిక చేశారు. మెయిన్స్ పరీక్షలు అక్టోబర్‌లో జరగనున్నాయి. అయితే హైకోర్టు కేసులు కొలిక్కి వచ్చాకే ప్రక్రియ కొనసాగించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని, టీజీపీఎస్సీని విజ్ఞప్తి చేస్తున్నారు. 2011 గ్రూప్-1 ఇలాగే ఐదేళ్లు సాగదీశారని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలోనూ గ్రూప్-1, 2తోపాటు ఇతర పరీక్షల పేపర్ లీకేజీలు, వివిధ కారణాలతో పరీక్షలు వాయిదా, రద్దయిన విషయం తెలిసిందే.

ఈ అనుభవాల దృష్ట్యా ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకుండా గ్రూప్-1 మెయిన్స్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఒకవేళ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాక వాయిదా వేయాలని లేదా పరీక్షలను రద్దు చేసే పరిస్థితిలు తలెత్తితే తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఒక స్పష్టత వచ్చాకే నియామక ప్రక్రియను కొనసాగిస్తే అభ్యర్థుల్లో భయాందోళనలు తొలగి పూర్తి స్థాయిలో పరీక్షలకు సన్నద్ధం అవుతారని విజ్ఞప్తి చేస్తున్నారు.

కేసులు క్లియర్ అయ్యాకే పరీక్షలు నిర్వహించాలె..

హైకోర్టులో ఉన్న కొన్ని కేసుల దృ ష్ట్యా అభ్యర్థులంతా ఆందోళన పడుతున్నారు. న్యాయపరమైన చిక్కులన్నీ కొలి క్కి వచ్చాకే గ్రూప్-1 మెయిన్స్ నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలి. మెయిన్స్ పరీక్షకు ముందే కేసులన్నీ క్లియర్ చేసేలా  రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీ చర్యలు తీసుకోవాలి.

 మఠం శివానంద స్వామి, 

గ్రూప్-1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థి

60 పోస్టులకు మాత్రమే కొత్త వారు అర్హులుగా ప్రకటించాలి

503 పోస్టులకు మొదట్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు వర్తింప చేయాలి. కొత్తగా కలిపిన 60 పోస్టులకు కొత్తగా దరఖాస్తు చేసిన 1.71 లక్షల మంది అభ్యర్థులతోపాటుగా పాత అభ్యర్థులకు వర్తింపచేయాలి. ఇదే అంశంపై మేము హైకోర్టును ఆశ్రయించాం. దీనిపై టీజీపీఎస్సీ త్వరగా కౌంటర్ దాఖలు చేయాలి.

 డి . హైమ, హైకోర్టు పిటిషనర్