- సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 83వేల కుటుంబాలు మాత్రమే గుర్తింపు
- గ్రేటర్‌లో 20.15 లక్షల కుటుంబాలకే పూర్తయిన సర్వే
- ఇంకా సర్వేజరగని కుటుంబాలు 3లక్షల వరకు ఉన్నట్లు అంచనా
- ఆందోళనలో సర్వేజరగని కుటుంబాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (విజయక్రాంతి): కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన నిరుపేదలు గత పదకొండేళ్లుగా నిరీక్షిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ తుదిదశకు చేరుకున్న సమయంలో వారిలో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన 9 నెలలకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ దరఖాస్తులో అభయ హస్తం కింద మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇండ్లు తదితర పథకాలకు సంబంధించి ప్రజలనుంచి వివరాలు స్వీకరించారు. అయితే ఈ దరఖాస్తులో రేషన్‌కార్డు లేనివారు వివరాలు నమోదు చేసేందుకు అవకాశం లేకపోవడంతో ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ప్రస్తుతం రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియలో ప్రజాపాలన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకుండా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆధారంగా కార్డుల జారీ ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ సర్వే పూర్తికాని కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
ఆందోళనలో 3 లక్షల కుటుంబాలు..
గ్రేటర్‌వ్యాప్తంగా 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లు ఉండగా దాదాపు కోటి 30 లక్షల జనాభా ఉంది. మొత్తం కుటుంబాల సంఖ్య 23 లక్షల 82 వేల 247 ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వీటిలో 20 లక్షల 15 వేల 503 కుటుంబాలకు మాత్రమే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టి ఆన్‌లైన్ డేటా ఎంట్రీని సైతం అధికారులు పూర్తిచేశారు.
ఇంకా 3 లక్షల 66 వేల 744 కుటుంబాలకు సంబంధించి అధికారులు సర్వే చేపట్టలేదు. అయితే గ్రేటర్ అధికారులు మాత్రం సర్వేతో పాటు డేటా ఎంట్రీ కూడా పూర్తయినట్టుగా ప్రకటించారు. ప్రజా పాలనాలో అందిన దరఖాస్తులను కాకుండా, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆధారంగానే రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కోసం ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తికాని 3.66 లక్షల కుటుంబాలు తమకు రేషన్‌కార్డు అందదేమోననే ఆందోళనకు గురవుతున్నారు. అర్హులందరికీ పథకాలు అందజే ప్రకటించిన ప్రభుత్వం.. రేషన్ కార్డుకు సమగ్ర సర్వేకు లింక్ చేయడంపై వారు అసహనం వ్యక్తం చేసు ్తన్నారు.
సమగ్ర సర్వే ఆధారంగానే రేషన్ కార్డు..
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాల ఆధారంగా సివిల్ సప్లయ్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన డేటా ప్రకారం బల్దియాలో రేషన్ కార్డుల జారీకి వెరిఫికేషన్ జరుగుతున్నట్లు సమాచారం. ఈనెల 26 నుంచి రేషన్ కార్డుల జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రేటర్ పరిధిలో కార్డుల జారీ ప్రక్రియపై అధికారులు కసరత్తు చేపడుతున్నారు.
రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియలో భాగంగా 16 నుంచి 20 దాకా ఫీల్డ్ వెరిఫికేషన్, 20 వరకూ వార్డుల వారీగా లబ్ధిదారుల ఎంపిక, 21-25 దాకా డేటా ఎంట్రీ పూర్తిచేసి 26వ తేదీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు మొత్తం ప్రక్రియను పూర్తచేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.