- రైతుల శ్రమను దోచుకుంటున్న వ్యాపారులు
- అంతంతమాత్రంగా ధర ఇచ్చి దగా
- సీసీఐ కేంద్రాలు ప్రారంభమైతేనే సమస్యలకు చెక్
- కేంద్రాలు ప్రారంభించేందుకు మార్కెటింగ్ శాఖ చర్యలు
గజ్వేల్, నవంబర్ 3: ఆరుగాలం శ్రమించి.. పత్తి పండించి.. దిగుబడి చేతికొచ్చిన తర్వాత వ్యయప్రయాసల కోర్చి మార్కెట్‌కు పంట తీసుకువస్తే.. మార్కెట్‌లో ఆ పంటకు మద్దతు ధర అందడం లేదు. దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు. 20 రోజుల నుంచి గజ్వేల్, సిద్దిపేట మార్కెట్లకు రైతులు భారీగా పత్తి తీసుకొస్తున్నారు.
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గత బుధవారం అత్యధికంగా క్వింటాకు రూ.6,775 లభించింది. గజ్వేల్ మార్కెట్‌యార్డుతో పాటు పత్తిమిల్లు, జిన్నింగ్ మిల్లుల పరిధిలో 2,970 మంది రైతులు మొత్తం 14,290 క్వింటాళ్ల పత్తిని విక్రయించారు. వ్యాపారులు, పత్తి మిల్లుల యాజమా నులు క్వింటాకు రూ.6,500కు మించి ధర ఇవ్వడం లేదు.
ఒక్క గజ్వేల్ ప్రాంతం నుంచే 6 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్‌లోకి రానున్నది. ఇప్పటికే మొదటి విడత పత్తికి సంబంధించి 15శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయి. పంట విక్రయించిన రైతులకు పెద్దగా ధర అందలేదన్నది వాస్తవం. వారు నష్టపోయారన్నది నిజం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వెంటనే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
ఏర్పాటైన కేంద్రాలు ఇవీ..
ప్రభుత్వం గజ్వేల్ ప్రాంతంలోని ఈశ్వరసాయి, సాయిబాలాజీ జిన్నింగ్ మిల్లు, జగదేవ్‌పూర్ మండలంలోని శ్రీనివాస పత్తి మిల్లులో మొదటి విడత సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నది. హుస్నాబాద్‌లో ఇప్పటికే రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గజ్వేల్‌లో ఇవా ళో.. రేపో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయి. రెండో విడతలో రెట్టింపు సంఖ్య లో కేంద్రాలు ఏర్పాటు కానున్నట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి విక్రయించాలి
పత్తి రైతులు మధ్య దళారులను ఆశ్రయించి మోసపోవద్దు. ఏఎంసీలో ఈనామ్ ద్వారా పత్తి కొనుగోలు నిర్వహిస్తున్నాం. మొదటి దశలో కొనుగోళ్ల ప్రక్రియ చేపడతాం. ఐదారు రోజుల్లో మరో మూడు సీసీఐ కేంద్రాలను ప్రారంభిస్తాం. 8 శాతంలోపు తేమ ఉన్న పత్తికి ప్రభుత్వం ప్రకటించిన రూ.7,521 మద్దతు ధర చెల్లిస్తాం. 8- 12శాతం తేమ ఉన్న పత్తికి తేమ శాతాన్ని బట్టి రూ.50 చొప్పున ధర తగ్గుతుంది.
జాన్ వెస్లీ, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి