* నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని నమ్మను
* అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తా..
* రైతభరోసా ఎగ్గొట్టేందుకే డైవర్షన్ రాజకీయాలు
* ప్రెస్‌మీట్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): ఫార్ములా ఈ రేస్ కేసుపై ఏసీబీ అధికారులు లాయర్ల సమక్షంలో విచారిస్తే సహకరిస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. న్యాయస్థానం అనుమతిస్తే న్యాయవాదులతో కలిసి తాను విచారణకు హాజరవుతానని తెలిపారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మంగళ వారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ కేసులో తాను సుప్రీం కోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తానని వెల్లడించారు. దుర్మార్గుల నుంచి తనకు చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరతానని వివరించారు. తాను ప్రభుత్వ అధికారులను నమ్మలేనని తెలిపారు.
విచారణకు న్యాయవాదిని తీసుకెళతానని ఇప్పటికే న్యాయస్థానాన్ని కోరగా, కోర్టు అందుకు అనుమతించలేదని స్పష్టం చేశారు. కొందరు రాష్ట్ర మంత్రులు వారే న్యాయమూర్తులైనట్లు తనకు శిక్షలు ప్రకటిస్తున్నారని దుయ్యబట్టారు.
ట్రయల్ మీడియా, సచివాలయం లేదా మంత్రుల పేషీలో జరగదని, కోర్టుల్లోనే జరుగుతుందనే విషయం మంత్రులు గుర్తుపెట్టుకో వాలని హితవు పలికారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేందుకే తమ హయాంలో కారు రేసింగ్ నిర్వహించామని తెలిపారు.
పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని, సీఎం రేవంత్‌రెడ్డిని చూస్తుంటే ఇప్పుడా సామెత గుర్తుకు వస్తున్నదని వ్యా ఖ్యానించారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే అక్రమంగా కేసు పెట్టారని, ఈ రేస్ కేసు లోట్టపీసు కేసు అని మరోసారి ఉద్ఘాటించారు.
బట్టకాల్చి మీద వేసి సీఎం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను చట్టాన్ని గౌరవించే పౌరు డినని, రాజ్యంగా పరంగా తాను ప్రతి హక్కు ను వినియోగించుకుంటానని స్పష్టం చేశా రు. ఏసీబీ విచారణకు లాయర్‌ను తీసుకెళ్తానంటే సీఎం భయపడ్డారని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం వెనకడుగు..
ఫార్ములా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చపెట్టమని బీఆర్‌ఎస్ సభ్యులు కోరారని, కానీ కాంగ్రెస్ సభ్యులు వెనక్కి తగ్గి పారిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో చర్చకు సిద్ధమంటే, తానూ సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.
ఈరేస్ కేసుపై ఉన్న శ్రద్ధ సీఎంకు రైతుభరోసా అమలుపై లేదని దుయ్యబట్టారు. డైవర్షన్ రాజకీయాలు చేస్తూ సీఎం పబ్బం గడుపుకొంటున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతులకు 12 సార్లు రైతుబంధు పేరిట పెట్టుబడి సాయం అందించామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ నాటకాలను ప్రజల ముందు బట్టబయలు చేసేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతు న్నదని వెల్లడించారు. బీజేపీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచలా మారిందని, రెండు పార్టీలు కలిసి ప్రజలను మభ్యపెడుతున్నాయని విరుచుకుపడ్డారు. రాష్ట్రప్రభు త్వం ‘క్విడ్ అండ్ ప్రో కో’లో భాగంగానే మెగా కంపెనీకితో పాటు రాఘవ కంపెనీకి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను అప్పగించిందని ఆరోపించారు.
మళ్లీ పుంజుకుంటా..
‘నాకు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, తిరిగి బలంగా పుంజుకుంటా. నేటి అడ్డంకులే రేపటి విజయానికి బాటలు వేస్తాయి’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తన పోరాటం సత్యం కోసమని పేర్కొన్నారు.