calender_icon.png 20 October, 2024 | 6:12 PM

చేవెళ్ల మున్సిపల్ కల నెరవేరేనా?

16-10-2024 01:17:48 AM

2018లోనే జీవో ఇచ్చిన గత ప్రభుత్వం  

జీపీల విలీనాన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించడంతో బ్రేక్ 

ప్రతిపాదనపై కదలిక లేక స్థానికుల పెదవి విరుపు

ఈ ప్రభుత్వమైనా మున్సిపాలిటీ చేయాలని వేడుకోలు

చేవెళ్ల, అక్టోబర్ 15: చేవెళ్లను మున్సిపాలిటీగా చూడాలని పట్టణవాసుల ఆశ. ఈ కల ఎప్పుడు సాకారమవుతుందోనని వారు దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఐదేళ్ల క్రితం శంకర్‌పల్లి మున్సిపాలిటీగా మారిన సమయంలోనే గత ప్రభుత్వం చేవెళ్లను కూడా మున్సిపాలిటీ చేస్తూ గత సర్కారు జీవో ఇచ్చింది.

ఈ మేరకు రూ.15 కోట్ల నిధులను సైతం కేటాయించింది. కానీ, అప్పట్లో కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు గ్రామ పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత మున్సిపాలిటీ ఊసే లేకుండాపోయింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతోంది.

అయి నా.. చేవెళ్ల మున్సిపాలిటీ డి మాండ్‌పై ఎవరికీ పట్టింపు లేద ని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే వారు ఎమ్మెల్యే యాదయ్యను కలిసి ఒత్తిడి తెచ్చారు. ప్రతిపాదనపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పం దించారు. ఈ అంశంపై రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు.

10 పంచాయతీల విలీనం ?

చేవెళ్ల మున్సిపాలిటీగా మారితే దీనిలో మరో 10 పంచాయతీలను విలీనం చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా దామరిగిద్ద, ఇబ్రహీంపల్లి, కేసారం, దేవుని ఎర్రవల్లి, పామెన, కందవాడ, పలుగుట్ట, మల్లారెడ్డిగూడ, మల్కాపూర్, ఊరెళ్ల మున్సిపాలిటీలో విలీనమవుతాయని గతంలో ప్రచారం జరిగింది. ఆయా గ్రామాల్లో మొత్తం 25 వేల వరకు జనాభా ఉంటుంది.

మరోవైపు యంత్రాంగం మాత్రం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో మున్సిపాలిటీలో విలీనం అవుతాయనుకుంటున్న పంచాయతీలు సైతం ఉన్నాయి. అలా ఆయా పంచాయతీల్లో లోకల్ ఎన్నికలు జరుగుతాయని తెలుస్తున్నది. దీన్నిబట్టి మున్సిపాలిటీ కల నెరవేరే రోజు మరింత దూరం వెళ్లినట్లేనని స్పష్టమవుతున్నది.

వ్యతిరేకిస్తున్న విలీన గ్రామాల నేతలు ..

చేవెళ్ల మున్సిపాలిటీ ఏర్పాటును విలీన గ్రామాలకు చెందిన రాజకీయ నేతలు వ్యతిరేకిస్తున్నారు. 2023 జూన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి ఆయా గ్రామాలకు చెందిన ప్రజల్లో ఎక్కువ మంది ఉపాధి హామీ పథకంపై ఆధారపడి జీవిస్తున్నారని, పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనమైతే వారంతా ఉపాధి కోల్పోతారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

అంతేకాదు పార్లమెంట్ సెగ్మెంట్ కేంద్రమైన చేవెళ్లలో రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఆర్డీవో కార్యాలయానికి సొంత భవనం లేదని, 2013లో శంకుస్థాపన చేసిన బస్ డిపోకే ఇప్పటివరకు అతీగతి లేకుండా పోయిందని వారు వాపోయారు. అలాగే డిగ్రీ కాలేజీ భవనం నిర్మాణ దశలోనే ఉందని, సర్కార్ ముందు వాటిని పూర్తి చేస్తే బాగుంటుందని వారు హితవు పలికారు.

అంతేకాదు చేవెళ్లకు పీజీ కాలేజీ, ఐటీఐ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ లేదని, ముందు వాటిని కేటాయించిన తర్వాతే మున్సిపాలిటీ ప్రతిపాదన తెరమీదకు తేవాలని డిమాండ్ చేస్తున్నారు.

మున్సిపాలిటీ కావాలంటున్న ప్రజలు..

చేవెళ్ల వాసులు మాత్రం తమకు మున్సిపాలిటీ కావాలనే కోరుతున్నారు. పట్టణం మున్సిపాలిటీ అయితే ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో పట్టణం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందంటున్నారు.

పక్కనే ఉన్న శంకర్‌పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.కోట్లలో నిధులు మంజూరవుతుంటే, చేవెళ్ల మాత్రం అభివృద్ధిలో వెనుకబాటులోనే ఉంటున్నదని అంటున్నారు. రాజకీయ నేతలు కేవలం తమ స్వలాభం కోసమే మున్సిపాలిటీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వం  వారిని పట్టించుకోకుండా చేవెళ్లను మున్సిపాలిటీ చేయాలని కోరుతున్నారు.

ఎలాంటి ఆదేశాలు లేవు..

చేవెళ్లను మున్సిపాలిటీగా ఏర్పా టు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ ఉన్న మాట వాస్తవమే.  దీనిపై ప్రతిపాదనలు పంపించాలని మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. పైనుంచి మాకు ఆదేశాలు వస్తే రెవెన్యూశాఖ పరంగా నివేదిక సిద్ధం చేసి పంపిస్తాం.

 సాయిరాం, ఆర్డీవో, చేవెళ్ల

చేవెళ్ల మరింత అభివృద్ధి చెందుతది..

చేవెళ్ల మున్సిపాలిటీగా మారితే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుంది. 2018లో ఒకసారి, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకసారి మున్సిపాలిటీ ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. గతప్రభుత్వమైతే ఏకంగా మున్సిపాలిటీగా మారుస్తున్నట్లు ప్రకటన సైతం విడుదల చేసింది. కానీ, అన్నీ ప్రతిపాదనలు ఇప్పుడు అటకెక్కాయి. ఈ ప్రభుత్వమైనా చొరవ తీసుకుని చేవెళ్లను మున్సిపాలిటీగా మార్చాలని కోరుతున్నాం.

 అత్తెల్లి శేఖర్‌రెడ్డి, 

స్థానికుడు, చేవెళ్ల