calender_icon.png 22 January, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలే తొలగిస్తారా?

22-01-2025 01:44:36 AM

  1. కమిషనర్ సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ నేతల డిమాండ్
  2. నల్లగొండ మున్సిపల్ ఆఫీసు ముట్టడి
  3. మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడి రాకతో వివాదం

నల్లగొండ, జనవరి 21 (విజయక్రాంతి): నల్లగొండలో బీఆర్‌ఎస్ రైతు మహాధర్నా నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడం వివాదానికి దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను అలాగే ఉంచి తమ పార్టీవి మాత్రమే ఎందుకు తొలగించారో చెప్పాలంటూ బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు కార్యకర్తలతో కలిసి మంగళవారం మున్నిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు.

సమాధానం చెప్పాలని మున్సిపల్ కమిషనర్‌ను నిలదీశారు. ఆయన స్పందించకపోవడంతో కమిషనర్ కార్యాలయంలోనే బైఠాయించి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు భువనగిరి దేవేందర్‌తోపాటు పలువురు ముఖ్యనేతలు నిరసన తెలిపారు. పోలీసులు అక్కడి చేరుకొని బీఆర్‌ఎస్ నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలోనే మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు కార్యాలయంలోకి రావడంతో ఇరుపార్టీల నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో కార్యాలయంలో పూలకుండీలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో పోలీసులు బీఆర్‌ఎస్ శ్రేణులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భూపాల్‌రెడ్డిని పరామర్శించారు. సాయంత్రం నల్లగొండలో మీడియాతో మట్లాడుతూ.. పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మండిపడ్డారు.

నెలల తరబడి ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించకుండా ఒక్కరోజు ముందు ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలను మాత్రమే ఎలా తొలగిస్తారని నిలదీశారు. మంత్రి కోమటిరెడ్డి అనుచరుల ఆగడాలు పరాకాష్టకు చేరాయని దుయ్యబట్టారు.