ఆచార్య చాణక్యుడి రాజనీతి శాస్త్ర ప్రకారం ఏ వ్యవస్థలో అయినా విజయవంతం కావాలంటే కచ్చితంగా క్రమశిక్షణతో పాటు మెరుగైన నిర్ణయాలు తీసు కుంటూ, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునే లక్షణాలు కలిగి ఉండాలి. ఈ రాజనీతి సూత్రాన్ని ప్రస్తుతం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనుసరించాల్సిన అవ సరం ఎంతో ఉంది. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు అవకాశాలున్నా, సరైన మార్గదర్శకం లేక అంతర్గత కుమ్ములాటలతో పార్టీ రోజురోజుకు బలహీనపడుతోంది.
దేశంలోని ఇతర రాష్ట్రాల ఎన్నికలతో బీజేపీ అధిష్ఠానం బిజీగా ఉండడంతో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతోందని చెబుతూ ఎప్పటికప్పుడు వాయి దాలతో రాష్ట్రంలో పార్టీని పట్టించుకోవడం లేదు. హర్యానా, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావడంతో బీజేపీ హైకమాండ్ ఇప్పటికైనా తెలంగాణలో పార్టీ బలోపేతానికి సరైన నిర్ణయాలు తీసుకుంటుందని పార్టీ నేతలు, కార్యకర్తలు, సాను భూతిపరులు ఎదురుచూస్తున్నారు.
నేతలమధ్య సమన్వయ లోపం
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మెరుగై న ఫలితాలు సాధించే అవకాశాలున్నా పార్టీ రాష్ట్ర నాయకుల మధ్య సమన్వయలోపం తో 8 స్థానాలకే బీజేపీ పరిమితమ య్యింది. అనంతరం ఐదు నెలల వ్యవధిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ చరిష్మాతో 8 నియోజకవర్గాల్లో గెలవడంతో రాష్ట్రంలో పార్టీ పుంజుకుంటోందనే ఆశలు రేగాయి. 8 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు గెలిచిన బీజేపీ భవిష్యత్తులో 88 సీట్లతో అధికారం చేపడుతుందని రాష్ట్ర నేతలు చేసిన ప్రకటనలు గాలిమేడలుగా మారుతున్నాయి.
ప్ర స్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చూస్తే భవిష్యత్తులో 16 స్థానాలైనా గెలుస్తుం దా..? లేక ఉన్న స్థానాలనే కోల్పోతుందా..? స్థానిక ఎన్నికల్లో 8 జడ్పీటీసీలైనా గెలుస్తుందా..? అనే సందేహాలొస్తున్నాయి.
‘గ్రేటర్’ ఫలితాల జోష్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడంతో పాటు పలు ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయానికి అప్పటి అధికార బీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎది గినట్టు వాతావరణం ఏర్పడింది. అయితే ఇతర పార్టీ నేతలు బీజేపీలోకి వలసలు రావడంతో కొత్త, పాత నేతల మధ్య అంతర్యుద్ధం మొదలై సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో సీనియర్ నేత కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తామని పార్టీ చెప్పడంతో మరింత గ్రూపు రాజకీయాలు పెరిగాయి. దీనికి తోడు క్షేత్రస్థాయి లో పార్టీ బలహీనంగా ఉండడం, అదే సమయంలో కాంగ్రెస్‌కు బలమైన కేడర్ ఉండడంతో ప్రజలు బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను ఆదరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైనా జాతీయ స్థాయి అంశాలు, మోదీ చరిష్మాతో తెలంగాణ ప్రజలు లోక్‌సభ ఎన్నిక ల్లో పార్టీకి కాంగ్రెస్‌తో సమానంగా 8 స్థానా లు కట్టబెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క స్థానమే ఇచ్చిన రాష్ట్ర ప్రజలు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలిపించారు.
అరడజను మంది పోటీ
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆదిరిస్తున్నా, పార్టీ రాష్ట్రంలో బలోపేతం కాకపోవడం స్వయంకృతాపరాధమే. అధిష్ఠానం పూర్తిస్థాయి దృష్టి సారించకపోవ డమే దీనికి ప్రధాన కారణం. రాష్ట్ర సారథిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్‌రెడ్డి పదవి తాత్కాలికమే అని, త్వరలో మరొకరిని నియమిస్తారని పార్టీలో ప్రచారం ఉన్నా, పది హేను నెలలు గడిచినా నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ అధిష్ఠానం మరొకరిని నియమించలేకపోయింది.
కేంద్ర మం త్రిగా బిజీగా ఉండడంతోపాటు రాష్ట్రంలో పార్టీ పరిస్థితితో కిషన్‌రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతలను ముళ్లకుర్చీగా భావిస్తున్నా, అధి ష్ఠానం తాత్సారంతో పార్టీలో మరింత గందరగోళం నెలకొంటోంది. పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికివారే అధ్యక్ష పదవిపై కన్నేసి పార్టీలో ఐక్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ, రామచంద్రారావుతో పాటు మరి న్ని పేర్లు వినిపిస్తున్నా, తాను కేంద్ర మంత్రి గా బిజీగా ఉన్నానని ఇటీవల బండి సంజ య్ ప్రకటించినట్టు మీడియాలో వైరల్ అయ్యింది.
పార్టీ చీఫ్ పదవికి అరడజనుకు మందికి పైగా ప్రయత్నిస్తున్నా, పార్టీ బలోపేతానికి ఐక్యంగా కార్యక్రమాలు చేపట్టడం లో విఫలమవుతున్నారు. ఇటీవల కొన్ని ఉద్యమాలు, కార్యక్రమాలు చేపట్టినా వాటి లో కూడా గ్రూపు రాజకీయాలు నడిచాయి. నిరుద్యోగుల సమస్య, దేవాలయా లపై దాడులు, రైతుల రుణమాఫీ వంటి అంశాలపై ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్టు విడివిడిగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు.
అందరూ కలిసికట్టుగా పోరాడితే పార్టీకి మైలేజీ వచ్చేదని కిందస్థాయి నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నా పార్టీలో పట్టించుకునేవారే లేరు. అంతేకాక పార్టీ పేరున నిర్వహించిన కొన్ని నిరసన కార్యక్రమాలను పాత నేతలు, పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలు అంటూ గిరి గీసుకొని గ్రూపు ల వారీగా నిర్వహించారు. పార్టీ చీఫ్ మూసీనదిపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పిలుపిచ్చిన నిరసన కార్యక్రమాల్లో నేతలందరూ పాల్గొన్నట్టు పైకి కనిపించినా, మొక్కు బడిగానే నిర్వహించినట్టు పార్టీలోనే గుసగుసలు వినిపించాయి.
మూసీ అంశం లో హైదరాబాద్ కీలకమైనా నగరానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ కార్యక్రమాన్ని పట్టించుకోలేదు. శాసనసభ పార్టీ ఫ్లోర్ లీడర్ పదవి దక్కలేదని హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిత్యం అసంతృప్తిగానే ఉంటారు. మరో వైపు ఏదో సమస్యతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చూసే ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా అంతా తానే అంటూ వ్యవహరిస్తారనే విమర్శలు ఉన్నాయి. ఎంపీలు కూడా కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు తక్కువే.
పార్టీలో ఎం పీలు, ఎమ్మెల్యేలు ఒకరితో ఒకరు సంబంధం లేకుండా వ్యవహరి స్తారనడానికి ఉదాహరణగా ‘హైడ్రా’ అం శాన్ని చెప్పుకోవచ్చు. ఇలాంటి సున్నితమైన అంశాలపై పార్టీ హైకమాండ్ నుంచి కూడా దిశా నిర్దేశం లేకపోవడంతో మరింత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
‘స్థానిక’ ఎన్నికలు ఓ సదవకాశం!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా, ఇచ్చిన పలు హామీలను ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేకపోయింది. మరోవైపు రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ నిర్ణయాలను వెలికితీస్తూ బీఆర్‌ఎస్‌ను ఇబ్బందులపాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. దీనిని అవకాశంగా మలుచుకొని కాంగ్రెస్‌ను నిలదీ యాల్సిన బీజేపీ పార్టీలో అనైక్యతతో పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టలేకపోతోం ది.
పార్టీలో నేతల నిర్లక్ష్యం ఎంతకు చేరుకుందంటే, పార్టీ నిర్వహించిన సభ్యత్వ కార్యక్రమం ఒక ప్రహసనంగా సాగింది. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలు బీజేపీకి ఒక చాలెంజ్‌తో పాటు అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి. స్థానిక ఎన్నికలను ఒక అస్త్రంగా మల్చుకుంటే నాలుగేళ్ల అనంతరం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలుంటాయి. దీనిని జారవిడ్చుకోకుండా స్థానిక ఎన్నికల్లో పార్టీలో కష్టపడే వారిని, సానుభూతిపరులను ప్రోత్సహించి సర్పం చ్, ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలిపించుకుంటే క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్ట పర్చుకోవచ్చు.
బీజేపీ హైకమాండ్ రాష్ట్రం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పార్టీలో క్రమశిక్షణకు చర్యలు తీసుకోవడంతోపాటు వీలైనంత త్వరగా పార్టీ రాష్ట్ర చీఫ్‌ను ఎంపిక చేస్తే రాష్ట్రంలో పార్టీ గాడిన పడే పరిస్థితులు ఉంటాయి. లేకపోతే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి షరా మాములుగానే తయారవడం ఖాయం.
-వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.