calender_icon.png 25 November, 2024 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ ఓట్లతో గెలిచి వెన్నుపోటా?

25-11-2024 02:03:37 AM

  1. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 
  2. హాలియాలో కవియిత్రి మొల్లమాంబ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

నల్లగొండ, నవంబర్ 24 (విజయక్రాంతి): బీసీ ఓట్లతో గెలిచిన అగ్రకులాల నేతలు వారికి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా హాలియా పట్టణంలో కవయిత్రి మొల్లమాంబ విగ్రహ ఏర్పాటుకు ఆదివారం ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు.

బీసీ బిడ్డ మొల్లమాంబ విగ్రహ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటని విమర్శించారు. హాలియా కుమ్మరులు మొల్లమాంబ విగ్రహ ఏర్పాటుకు ఇటీవల దిమ్మె నిర్మించగా అనుమతులు లేవని మున్సిపల్ అధికారులు కూల్చేశారు. ఈ విషయం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన పలువురు బీసీ ముఖ్యనేతలతో కలిసి ఆదివారం అదేచోట భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డికి ఇంకా పదవీ వ్యామోహం తగ్గలేదని విమర్శించారు. సీఎం పదవి మినహా అన్ని అనుభవించిన ఆయన ఇప్పుడు కుమారులకు పదవులు వచ్చేలా చేసుకున్నాడని వ్యాఖ్యానించారు. హాలియా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పార్వతమ్మ భర్త కోమాలో ఉంటే ఆడబిడ్డ అనే జాలి లేకుండా పదవిని లాగేసి నరేందర్‌రెడ్డి అనే వ్యక్తికి కట్టబెట్టారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తే జానారెడ్డి హాజరై అడ్డు చెప్పారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీసీలంతా సంఘటితమై బీసీ బిడ్డలు ఏ పార్టీ నుంచి నిలబడినా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో రానున్నది బీసీ రాజ్యమేనని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, తండు సైదులుగౌడ్,  సూర్యారావు, తమ్మడబోయిన అర్జున్, కోట్ల వాసుదేవ్ పాల్గొన్నారు.