30-04-2025 12:26:37 AM
చర్ల ఏప్రిల్ 29: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతకు భద్రతాబలగాలు జరుపుతున్న కాల్పులకు వన్యప్రాణులు విలవిల్లాడుతు న్నాయి. కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో కాల్పుల మోతకు భయపడి వన్యప్రాణులు చెల్లాచెదరవుతూ గ్రామాల వైపు వస్తున్నాయని స్థానిక గ్రామాల ప్రజలు చెపుతున్నారు.
మావోయిస్టులను మట్టుబెట్టేందుకు కర్రెగుట్టల చుట్టూ వేల సంఖ్యలో భద్రతా బలగాలు చుట్టుముట్టాయని స్థానిక గ్రామాల ప్రజలు చెపుతున్నారు. ఇప్పటికే బాంబులమోతకు కొన్ని వనప్రాణులు మరణించి ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు. కాగా వన్నె ప్రాణుల సంరక్షణ చట్టాలు ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కాల్పుల విరమణ పాటించాలి: ప్రజాసంఘాలు
కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతకు భద్రతా దళాలు మోహరించడాన్ని 300లకు పైగా సంస్థలు, ప్రజా సంఘాల నాయకులు ఖండించారు. కాల్పుల విరమణ పాటించాలని డిమాండ్ చేశారు. గిరిజనుల ఇబ్బందులను గుర్తుచేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖను కూడా పంపారు.
గత ఇరవై ఏళ్లలో మావోయిస్టులు, భద్రతా బలగాల పోరాటం కారణంగా గిరిజనులు ఎన్నో కోల్పోయారని పేర్కొన్నారు. గత 16 నెలల్లోనే 400 మంది మృతిచెందారని, వారిలో శిశువు కూడా ఉండటం బాధాకరమన్నారు. కాల్పు ల విరమణ పాటించాలని ప్రభుత్వాలను కోరారు. కాల్చివేత ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు అని ఎత్తిచూపారు.
మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించాలని కోరారు. బస్తర్, జార్ఖండ్‌లో కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం ఎంవోయూ పొందిన ప్రభుత్వం మావోయిస్టుల అణిచివేతకు పాల్పడుతుందని ఆరోపించారు. శాంతి చర్చల కోసం, కాల్పుల విరమణ ద్వారా అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.