* పసిఫిక్ పాలిసెడ్స్, శాంటా మోనికా ప్రాంతాల్లో వ్యాపించిన మంటలు
* 30వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
* పలువురు హాలీవుడ్ నటుల ఇళ్లు దగ్ధం
వాషింగ్టన్, జనవరి 8: అగ్రరాజ్యంలో అత్యంత సంపన్నులు నివాసం ఉండే నగరాల్లో ఒకటైన లాస్ ఏంజెల్స్‌ను కార్చిచ్చు చుట్టుముట్టింది. దీంతో పసిఫిక్ పాలిసేడ్స్, శాంటా మోనికా ప్రాంతాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. అక్కడి వీధులను దట్టమైన పొగ కమ్మేసింది.
దీంతో ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్చిర్చు కారణంగా దాదాపు అక్కడ 3000 ఎకరాలు దగ్ధమయ్యాయి. సుమారు 30వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మొత్తం 13వేల నిర్మాణాలను కార్చిచ్చు ముప్పు ఉన్నట్టు లాస్ ఏంజెల్స్ అగ్నిమాపక అధికారి క్రిస్టీన్ క్రావ్లీ ప్రాథమికంగా అంచనా వేశారు. బెవర్లీ హిల్స్, హావీవుడ్ హిల్స్, మలిబు, శాన్ ఫెర్నాండక్ష ప్రాంతాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. కాగా మంటలను ఆర్పడానికి విమానాలు, హెలికాప్టర్లు, బుల్డోజర్లు రంగంలోకి దిగాయి.
కార్చిచ్చు కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సుమారు 62వేల మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. కార్చిచ్చుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా తెప్పించుకుంటున్నట్టు చెప్పారు. అక్కడి ప్రజలకు అవసరమైన సాయాన్ని వైట్‌హౌస్ అందిస్తుందని పేర్కొన్నారు.
ఇళ్లు కోల్పోయిన సినిమా స్టార్లు
ప్రముఖ హాలీవుడ్ నటులు జేమ్స్ వుడ్స్, టామ్ హాంక్స్, రీస్ మిథర్సూన్, స్పెన్సర్ ప్రాట్, హెడీ మోంటాగ్ సహా మరికొందరి సినిమా స్టార్ల ఇళ్లు కార్చిచ్చులో దగ్ధమైనట్లు అంతర్జాతీయ మీడియా తన కథనాల్లో పేర్కొంది.