- వాహనంలో తరలిస్తుండగా అడ్డుకున్న అటవీ సిబ్బంది
- పరారీలో ముగ్గురు నిందితులు
నిజామాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): నందిపేట్ మండలంలోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు నాలుగు అడవి పందులను వేటాడి పట్టుకున్నారు. వాటిని వాహనంలో తరలిస్తుండగా అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు. అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. షాపుర్ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు అటుగా వస్తున్న వాహనాన్ని అడ్డుకుని సోదా చేశారు.
ఈ క్రమంలో వాహనం నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి అక్కడి నుంచి ఉడాయించారు. అటవీశాఖ సిబ్బంది వాహనంలో నాలుగు అడవి పందులను గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేశారు. అడవి పందులను వేటాడేందుకు ఉపయోగించే వినియోగించే జీఐ వైర్లు, వలలను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. అనంతరం అడవి పందులను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. వేటగాళ్లు వలలు, జీఐ వైర్లు వినియోగించి వన్యప్రాణులను పట్టుకుంటున్నారని అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ తెలిపారు.