రాష్ట్రంలో ఇటీవలి కాలంలో జన సంచారం కలిగిన ప్రాంతాలలో క్రూరమృగాలు సంచరిస్తుండడం ఆశ్చర్యంతో పాటు ఆందోళన కలిగిస్తున్నది. పులి, చిరుతపులి, ఎలుగుబంటి వంటి ప్రమాదకర అడవి మృగాలు జనావాసాలలోకి హఠాత్తుగా వచ్చేస్తున్నాయి. అందుబాటులో వున్న కుక్క, మేక, పాడి పశువులు వంటి పెంపుడు జంతువులను అవి భక్షిస్తూ వున్నాయి. వాటి ఉనికి తెలియడంతో ప్రజలు భయకంపితులవు తు న్నారు. ఒక్కోసారి అవి మనుషులపైనా దాడి చేసి గాయపరచి, హతమార్చిన సందర్భాలు ఉన్నాయి.
ముఖ్యంగా పొలం పనులకు వెళ్ళే రైతులు ఒంటరిగా వెళ్ళాలంటే వణికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని, వారు గుంపులుగా పొలం పనులకు వెళుతున్నారు. ‘మేము చిరుతను చూశాం’ అని జనాలు చెబుతుండటంతో అటవీశాఖ అప్రమత్తమైంది. వెంటనే క్రూరమృ గాలు సంచరించిన చోట వివరాలు సేకరించి వాటిని పట్టుకోవడానికి అధికా రులు బోనులు సిద్ధం చేశారు. ఇంతవరకు మానవాళికి పెద్ద ఎత్తున ఎలాంటి ప్రమాదాలు రాలేదు. కానీ, పరిస్థితులు మాత్రం భయం గొలిపేవిగానే ఉంటున్నాయి. పొరపాటున అవి మనుషులను చంపితే ఎవరు బాధ్యులు? ఒక్కోసారి వాటిని మనుషులు హతమారిస్తే అటవీ చట్టాల ప్రకారం కేసు బుక్ అవుతుంది కదా.
వన్యప్రాణులు కావచ్చు, క్రూరమృగాలు కావొచ్చు, వాటిని వేటాడి చంపితే జరిమానా, జైలుశిక్ష సదరు వ్యక్తికి పడతాయి. అప్పుడు ఆ వ్యక్తి కోర్టుచుట్టూ తిరగవలసి వస్తుంది. ఇది తలకు మించిన భారమే. వన్యమృగాలు జనావాసాల్లోకి వచ్చినప్పుడు వాటిని చంపకుండా వదిలేయడం వల్ల సమస్య అపరిష్కృతంగానే ఉంటున్నది కదా? ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి లేదా ప్రాణరక్షణ కోసమో వాటిని గాయపరిస్తే ఎలా? ఈ మేరకు అటవీ చట్టాలను సవరించాలని కూడా ప్రజలు కోరుతున్నా రు. అటవీశాఖవారు క్రూరమృగాలను బంధించటానికి బోనులు ఏర్పాటు చేయడం వరకూ బాగానే ఉంది. అయితే, బోనులో పడిన క్రూర జంతువులను ఏ జంతు ప్రదర్శనశాలలో వదిలినా బాగుంటుంది.
సమస్య మళ్లీ మొదటికి!
అలా కాక, వాటిని మళ్ళీ దట్టమైన అడవులలోనే స్వేచ్ఛగా వదిలి పెడుతున్నారు. దీంతో సమస్య మళ్ళీ మొదటికే వస్తున్నది. బోనులో చిక్కిన వాటిని ఎందుకు అలా అడవులలో వదలాలి? “వాటిని ‘జూ’లో వదలండి” అని డిమాండ్ చేస్తున్న వారి సంఖ్యకూడా ఎక్కువగానే ఉంది. అవి తాగునీటి కోసమో, ఆహారం కోసమో అడవుల గుండా శివారు ఊర్లల్లోకి వచ్చి మనుషులు లేదా పెంపుడు జంతువుల ప్రాణాలు తీస్తున్నాయి. కొందరు దైర్యంతో వాటిని చంపితే కేసులు, అదే అవి మనుషులను చంపితే ఇక ఆ కుటుంబానికి దిక్కెవరు? క్రూరమృగాల భారిన పడిన వారికి కనీసం కోటి రూపాయలు పరిహారం ఇవ్వాల్సిందే.
పుణ్యక్షేత్రాలలో ముఖ్యంగా తిరుమల అడవులలో ఇవి దారి తప్పి వస్తున్నాయో లేదా మరో కారణంగా వస్తున్నాయో తెలీదు కానీ, పాదచారులను హడలెత్తిస్తున్నాయి. ఆ విధంగా ఓ చిన్నారిని పొట్టన పెట్టుకున్న సంగతి విదితమే. తరువాత మరెన్నోసార్లు క్రూరమృగాలు మనుషుల కంటపడిన సందర్భాలు ఉన్నాయి. వాటిని ఎదుర్కో వడానికి తిరుమల దేవస్థానం వారు భక్తులకు కర్రలు ఇచ్చిన విషయమూ తెలిసిందే. ఇప్పుడు కాలి బాటన నడచి వెళ్ళే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందని భోగట్టా. మహానంది పుణ్యక్షేత్రంలో కూడా ఒక చిరుత కనిపించింది. ఇదిలా ఉండగా ఈమధ్య ఎలుగు బంట్లు దర్శనం ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా ఈ అడవి మృగా లు ఎందుకు జనావాసాలలోకి వస్తున్నాయి? వచ్చిన వాటిని అతికష్టంతో బోనులో బంధించి మళ్ళీ అడవులలోకే పంపుతున్నారు కనుక, అవి మళ్లీ మళ్ళీ జనవాసాల లోకి వచ్చి బెంబేలెత్తిస్తున్నాయి. ఇవి నీళ్ళు, ఆహారం లేక వస్తున్నాయని అటవీ శాఖవారు అంటున్నా ఈ సమాధానంతో జనాలు అంగీకరించటం లేదు. ఒకవేళ ఏవైనా చిక్కితే, వాటిని ‘జూ’కు తరలించడమే శ్రేయస్కరం అని కూడా వారు సూచిస్తున్నారు.
‘పర్యావరణాన్ని రక్షించాలి. జంతువులు స్వేచ్ఛగా సంచరించాలి. అప్పుడే పర్యావరణ పరిరక్షణ’ అని కొందరి వాదన. ‘జూలలోనూ స్వేచ్ఛగానే సంచరిస్తాయి కదా’ అని ఎక్కువమంది జనాల మాట. ఏది ఏమైనా, క్రూర జంతువులను వివిధ జంతుప్రదర్శన శాలలలోనే స్వేచ్ఛగా వదిలి, అవి మళ్ళీ జనవాసాలలోకి రాకుండా చూడాలని, అప్పుడే ప్రజలకు రక్షణ ఉంటుందని ఎక్కువమంది అభిప్రాయ పడుతున్నారు. దీనిపై అటవీశాఖ, ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
కనుమ ఎల్లారెడ్డి
సెల్: 93915 23027