- మేడారం దర్శనానికి తీసుకెళ్లి, మద్యం తాగించి బండరాయితో మోది హత్య
- నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
ములుగు(జనగామ), డిసెంబర్ 24 (విజయక్రాంతి): ఈ నెల 22న ములుగు మండలం బండారుపల్లి రోడ్డులో లారీ డ్రైవర్ హత్యకు గురైన కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడి మోజులో పడిన మహిళే భర్తను కడతేర్చినట్టు గుర్తించారు. హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. హనుమకొండకు చెందిన ఓర్సు స్వప్న, శ్రీను దంపతులు. శ్రీను లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్వప్నకు హనుకొండకే చెందిన బుర్ర సంతోష్ మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది.
ప్రియుడ్ని తరచూ కలిసేందుకు తన భర్త శ్రీను అడ్డుగా ఉన్నాడని భావించిన స్వప్న.. అడ్డు తొలగించుకోవాలని నిర్ణయానికి వచ్చింది. ఈ విషయం ప్రియుడు సంతోష్‌తో పంచుకుంది. ఇద్దరు కలిసి శ్రీనును చంపాలని పథకం పన్నారు. ఇందుకోసం సంతోష్ తన మిత్రులైన ఆకుల అనిల్, బెల్లంకొండ చంద్రమోహన్‌ల సాయం కోరాడు. నలుగురు కలిసి పక్కా ప్లాన్ ప్రకారం శ్రీనును మేడారం దర్శనానికి వెళ్లేందుకు ఒప్పించారు.
శ్రీనుతో పాటు ఆయన భార్య స్వప్న, సంతోష్, అనిల్, చంద్రమోహన్ ఈ నెల 21న రాత్రి 8 గంటలకు హనుమకొండ నుంచి ఆటోలో మేడారం బయల్దేరారు. రాత్రి 11:30 గంటలకు ములుగు చేరుకున్నారు.
బండారుపల్లి రోడ్డులో నిర్మానుష్య ప్రదేశంలో ఆగి అందరూ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులోకి వెళ్లిన శ్రీనును నలుగురు కలిసి బండరాయితో తలపై మోది హత్య చేసి పరారయ్యారు. మరుసటి రోజు పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. మంగళవారం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.