calender_icon.png 27 November, 2024 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగర్ కర్నూల్ జిల్లాలో మరో దారుణం..!

27-11-2024 04:33:03 PM

ప్రియుడి మోజుల పడి భర్తను కడతేర్చిన భార్య..!

హతమార్చి ఆత్మహత్యగా మార్చే స్కెచ్ 

స్వాతి కేసు తరహాలోనే హత్యోదంతం

నాగర్ కర్నూల్ జిల్లాలో వరుసగా ఘటనలు

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): కలకాలం కలిసి  బ్రతుకుతామని వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న ఓ భార్య కామంతో కళ్ళు మూసుకొని ప్రియుడి మోజులపడి భర్తను అన్యాయంగా కాటికి పంపింది. తిరిగి నేరం తన మీద పడకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు శత విధాలా ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్వాతి హత్య కేసు మరో మారు గుర్తు చేసుకునే విధంగా నాగర్ కర్నూల్ జిల్లాలో స్వాతి కేసు తరహాలోనే కేసు బయటపడింది. తూడుకుర్తి గ్రామానికి చెందిన చింతలపల్లి జగదీష్ (35) తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన ఉద్యోగం జిల్లా పరిషత్ కార్యాలయంలో అటెండర్ గా పని చేసి ఈ మద్యే బిజినపల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్నాడు. తన ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒక కార్పొరేట్ పాఠశాలలో చదివిస్తున్నాడు.

కాగా తన భార్య కీర్తి ఎస్బిఎం అనే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో పనిచేస్తూ బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో సాన్నిత్యం పెరిగి అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. ఇది తెలిసిన భర్త మందలించడంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది. గత కొన్ని రోజుల క్రితం బిజినపల్లి మండల కేంద్రంలో ప్రియుడితోపాటు ప్రియుడి స్నేహితుడైన పాలెం గ్రామానికి చెందిన వ్యక్తితో కలిసి భర్తపై దాడి చేయించింది. అయినా వినకుండా ప్రియుడిని వదిలించుకోవాలని భర్త హెచ్చరించాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని తెగించింది. ప్రియుడితో మాట్లాడదామని ఈ నెల 24న తూడుకుర్తి గ్రామానికి భర్తతోపాటు ప్రియుడిని రప్పించింది.

అక్కడే మద్యం, చికెన్, రొట్టెలు తింటూ భర్తకు పూటుగా మద్యం తాగించి ప్రియుడితో కలిసి దారుణంగా హతమార్చింది. అనంతరం భర్త మృతదేహాన్ని కెఎల్ఐ కాలువలోకి తోసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరుసటి రోజు భర్త మృతదేహం బయటపడటంతో అనుమానంతో భర్త బంధువులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రస్తుతం ప్రియుడు, ప్రియురాలితో పాటు మరి కొంతమంది పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  గత కొన్ని ఏళ్ళ క్రితం స్వాతి రెడ్డి రాజేష్ అనే ప్రియుడితో కలిసి భర్తను అతికిరాతకంగా హతమార్చి భర్త స్థానంలో ప్రియుడిని తీసుకువచ్చేందుకు శతవిధాల ప్రయత్నించి విఫలమైన స్వాతి హత్య కేసు యావత్ మహిళాలోకాన్ని కలిసివేసింది. అచ్చం అలాంటి ఘటనలే నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రియుల మోజులో పడి భర్తలను అతి కిరాతకంగా భార్యలు హతమార్చుతున్న ఘటనలు తరచూ చోటు చోటు చేసుకుంటుండడంతో సర్వత్ర భయాందోళన వ్యక్తం అవుతుంది.