calender_icon.png 30 November, 2024 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భర్త ఉద్యోగంపై కన్నేసిన భార్య

30-11-2024 02:27:17 AM

  1. ప్రియుడితో కలిసి హత్య
  2. తల్లితో పాటు తమ్ముడి సహకారం 
  3. 70 కి.మీ. కారులో తరలించి కాల్వలో ముంచి దారుణం
  4. వీడిన అటెండర్ హత్య మిస్టరీ!

నాగర్‌కర్నూల్, నవంబర్ 29 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్న జగదీశ్ హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రియుడి మోజులో పడిన భార్య.. తన భర్తను చంపితే అడ్డు తొలగడంతోపాటు భర్త అటెండర్ ఉద్యోగాన్ని కూడా తాను పొందవచ్చని భావించి ప్రియుడితో కలిసి హత్య చేసింది.

అందుకు ఆమె తల్లి, తమ్ముడు కూడా సహకరించారు. శుక్రవారం డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామానికి చెందిన చింతపల్లి జగదీశ్(35) బిజినపల్లి ఎంపీడీవో కార్యాలయంలో తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన అటెండర్ ఉద్యోగం చేస్తున్నాడు. గద్వాలకు చెందిన కీర్తిని 2011లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారు తమ పిల్లలతో కలిసి నాగర్‌కర్నూల్ పట్టణంలో ఉంటున్నారు.

కొన్ని రోజులుగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా పెద్దలు సర్ది చేశారు. ఈ క్రమంలో పట్ణణంలోని బ్యూటీపార్లర్ నిర్వాహకురాలితో కీర్తికి ఏర్పడిన పరిచయంతో కల్వకుర్తి ప్రాంతంలోని ఎస్‌బిఎం రియల్ ఎస్టేట్ సంస్థలో సేల్స్ ఉమన్‌గా చేరింది. ఆ సమయంలో అక్కడే పనిచేసే బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన మండలి నాగరాజుతో పరిచయమై వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ విషయం తెలియడంతో కీర్తిని జగదీశ్ మందలించాడు. దీంతో భర్తను చంపితే తమ సంబంధానికి అడ్డు తొలగడంతోపాటు అతడి ఉద్యోగాన్ని కూడా వారసత్తంగా పొందవచ్చని ప్రియుడు నాగరాజుతో కలిసి కీర్తి పతకం వేసింది. నాగరాజు స్నేహితుడైన పాలెం గ్రామానికి చెందిన సొప్పరి శివ, జిల్లా కేంద్రంలో నకిలీ విలేకరిగా వ్యవహరిస్తున్న కాకునూరి సుధాకర్, కల్తీ కల్లు తయారీదారు మోహన్‌గౌడ్‌తో చేతులు కలిపారు.

ఈ నెల 24న దైవ దర్శనం పేరుతో కీర్తి తన తల్లిగారి ఊరైన గద్వాలకు భర్తను వెంటబెట్టుకుని వెళ్లింది. అక్కడే తాటికల్లు పేరుతో కల్లీకల్లులో మోహన్‌గౌడ్ ఇచ్చిన మత్తు పదార్థాన్ని వేసి తాగించింది. జగదీశ్ మత్తులోకి జారుకున్న తర్వాత పాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కారులోని డిక్కీలో కుక్కి 70 కిలోమీటర్లు తరలించి, జగదీశ్‌ను స్వగ్రామం తూడుకుర్తిలోని తన పొలం వద్దకు తీసుకెళ్లారు.

విద్యుత్ షాక్ తగిలి చనిపోయినట్లుగా చిత్రీకరిద్దామనుకున్నా ఆ సమయంలో కరెంట్ లేకపోవడంతో పక్కనే ఉన్న కేఎల్‌ఐ కాలువలోకి ముంచి హతమార్చారు. అనంతరం తన భర్త కనిపించడం లేదంటూ కీర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 25న కేఎల్‌ఐ కాల్వలో జగదీశ్ మృతదేహం లభ్యం కావడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

దీంతో కీర్తిని అదుపులోకి తీసుకుని విచారింగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. జగదీశ్ హత్యకు కీర్తికి తన తల్లి పద్మ, తమ్ముడు సాయికుమార్, ప్రియుడు నాగరాజులతో పాటు నాగరాజు స్నేహితులు సోప్పరి శివ, కాకునూరి సుధాకర్, మోహన్‌గౌడ్ సహకరించారు. పొలీసులు ఆరుగురిని రిమాండ్‌కు తరలించగా మోహన్‌గౌడ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.