27-04-2025 02:01:24 PM
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, (విజయక్రాంతి): ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి(Bhu Bharati Act) 25 నూతన ఆర్వో ఆర్ చట్టం ద్వారా రైతులకు విస్తృత ప్రయోజనాలు లభిస్తాయని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(Collector Adwait Kumar Singh) అన్నారు. భూభారతి చట్టం అమలు తీరుపై సీరోలు మండలం కాంపల్లి రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ఆర్వోర్ చట్టం ద్వారా రైతులకు తమ భూముల పై ఎలాంటి సమస్యలు లేకుండా ఉపకరిస్తుందని చెప్పారు. ఇలాంటి సమస్యలు తలెత్తిన పరిశీలించి నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించడానికి అనువైన చర్యలు తీసుకోవడానికి చట్టంలో అనేక మార్పులు చేయడం జరిగిందని తెలిపారు.
ఆన్లైన్ ఆఫ్లైన్ విధానం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు చేసుకోవచ్చని, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకుంటారని, ఉచితంగా న్యాయ సేవ సహాయం కూడా అందుతుందని చెప్పారు. గతంలో భూ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి ఆప్పీల్ వ్యవస్థ లేదని ఇప్పుడు ఆర్డీవో, కలెక్టర్ , సి సి ఎల్ ఏ స్థాయిలో అప్పీలు చేసుకోవచ్చని వివరించారు. ధరణి ద్వారా అనేక సమస్యలు తలెత్తగా ఇప్పుడు భూభారతిలో ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్డీవో కృష్ణవేణి, డీఏవో విజయనిర్మల, సర్వే ల్యాండ్ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహమూర్తి తహసీల్దార్ శ్రీనివాస నారాయణమూర్తి, ఎంపీడీవో గౌస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.