02-04-2025 07:59:43 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంపై ప్రజలందరికీ తెలిసే విధంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం కలెక్టర్ లో సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు లతో కలిసిమండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, బ్యాంకు మేనేజర్లతో రాజీవ్ యువ వికాసం పథకం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో అర్హులైన వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఈ నెల 14వ తేదీలోగా రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.
మండల ప్రజా పరిషత్ కార్యాలయాలలో, ప్రజా పాలన సేవా కేంద్రాలు దరఖాస్తులు అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రతి మండల కేంద్రంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని, దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. దరఖాస్తు నింపడంలో అభ్యర్థులకు సహాయకంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారి నుండి ప్రతులు తీసుకోవాలని తెలిపారు. దరఖాస్తుదారులు ఒకే రకమైన యూనిట్ కాకుండా గ్రామాలలో ఉండే అవసరాలను బట్టి యూనిట్లను ఎంపిక ఎంపిక చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తుకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో లేకుండా చర్యలు తీసుకోవాలని తహసిల్దారులను ఆదేశించారు. రేషన్ కార్డులు ఉన్నవారికి ఆదాయ ధ్రువపత్రం అవసరము లేదని తెలిపారు.
ఈ పథకంపై గ్రామాలలో, మున్సిపాలిటీలలో ప్రజలందరికీ తెలిసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మండల ప్రజా పాలన సేవా కేంద్రం వద్ద పథకంలో పొందుపరిచిన యూనిట్ల వివరాలు తెలిసే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సజీవన్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, మండలాల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.