04-04-2025 09:46:03 PM
అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కుమ్రంభీం అసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టిన లే అవుట్ లేని భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఎల్ఆర్ఎస్ రుసుము వసూలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఆదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండలం ఎల్లారం గ్రామపంచాయతీ పరిధిలో ఎల్ఆర్ఎస్ కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... లే- అవుట్ లేని భూముల క్రమబద్ధీకరణ కొరకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్- 2020 ద్వారా అవకాశం కల్పించిందని, ఈ క్రమంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి అర్హులైన వారి నుండి రుసుము వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లింపు కొరకు ప్రభుత్వం గడువు పొడిగించడం జరిగిందని, ఈ విషయం లబ్ధిదారులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.