calender_icon.png 26 November, 2024 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యేక కమిషనర్‌ను ఎందుకు నియమించలేదు?

26-11-2024 02:17:23 AM

వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): దివ్యాంగుల చట్టం కింద ప్రత్యేక కమిషనర్ నియమాకం చేపట్టకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ సోమవారం ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దివ్యాంగుల హక్కుల చట్టం సెక్షన్ 79 (1) కింద ప్రత్యేక కమిషనర్ ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ తోపాటు మరో సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సాహితి శ్రీకావ్య వాదనలు వినిపిస్తూ.. దివ్యాంగుల హక్కుల చట్టం కింద ప్రత్యేక కమిషనర్ లేకపోవడంతో సీనియర్ సిటిజన్ సంక్షేమ డైరెక్టర్‌కే కమిషనర్ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసిందన్నారు.

రెండు శాఖలకు చెందిన సంక్షేమ పథకాలపై పర్యవేక్షణ ఉండటం లేదని, పథకం అమలు చేసే అధికారే పర్యవేక్షణాధికారిగా ఉండటం వల్ల ఫిర్యాదులు ఇవ్వడం కూడా సాధ్యం కాదని చెప్పారు. దివ్యాంగుల హక్కుల రక్షణకు స్వతంత్ర కమిషనర్‌ను నియమించాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను వాయిదా వేశారు.