11-02-2025 01:45:07 AM
* డీఎస్సీ- 2008 నియామకాలు చేపట్టకపోవడంపై హైకోర్టు ఆగ్రహం
* మూడు రోజుల్లో అమలు చేస్తామన్న పాఠశాల విద్య కమిషనర్
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): డీఎస్సీ అర్హత సాధిం చిన 1,382 మంది బీఎడ్ అభ్యర్థులను కాం ట్రాక్ట్ పద్ధతిన మిగిలిన పోస్టుల్లో భర్తీ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసినా ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు సోమవారం పాఠశాల విద్య కమిషనర్ ఈవీ నరసింహారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉత్తర్వుల బేఖాతరును న్యాయస్థానం కోర్టు ధిక్కరణగా భావిస్తే ఏం చేస్తారని ప్రశ్నించింది. డీఎస్సీ పోస్టుల భర్తీ చేయాలనే పిటిషన్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ ఈ తిరుమలాదేవితో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. డీఎస్సీ 2008కి సంబంధించిన 1,382 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకుందని, నియామకాలకు మరికొంత సమయం కావాలని కోర్టును కోరారు.
దీంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. గతంలో బెంచ్ ఉత్తర్వులు అమలు చేయకపోతే విద్యాశాఖ కార్యదర్శి, కమిషనర్ హాజరుకావాలని న్యాయస్థానం గతంలోనే ఆదేశించిందని, వారు ఎందుకు హాజరు కాలేదని ధర్మాసనం ప్రశ్నించింది. హాజరుకాని వారిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తామని హెచ్చరించింది.
దీంతో ప్రభుత్వం తరఫు న్యాయవాది మధ్యాహ్నం వరకు గడువు ఇవ్వాలని కోరారు. మధ్యాహ్నం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నరసింహారెడ్డి ధర్మాసనం ముందు హాజరై.. నియామకాలకు ఎన్నికల కమిషన్ అనుమతి మంజూరు చేసిందని, నియామక ప్రక్రియను ఇప్పటికే ప్రారభించామని, మూడు రోజుల్లో పూర్తి చేస్తామని ధర్మాసనానికి వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషన్‌పై ఉత్తర్వుల అమలు కోసం తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.
రాధాకిషన్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్ట్ నోటీసులు
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): తన ఫోన్ ట్యాపింగ్ అయిందంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి పెట్టిన కేసులో ఏ2 నిందితుడు రాధాకిషన్‌రావు ముందస్తు బెయిలుపై వివరణ ఇవ్వాలంటూ సోమవారం హైకోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది.
విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. చక్రధర్ గౌడ్ అనే రియల్టర్ ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రాధాకిషన్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో పిటిషనర్ రాధాకిషన్‌రావుతో పాటు మరో నిందితుడు హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందుల్లే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. వారిని అరెస్ట్ చేయొద్దంటూ గతంలోనే ఉత్తర్వులిచ్చామని గుర్తుచేశారు.
అందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రస్తుత సందర్భంలో నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉందని వాదించారు. అందుకు న్యాయమూర్తి స్పందిస్తూ.. రెండు పిటిషన్లను కలిపి న్యాయస్థానం విచారిస్తుందని, వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావును ఆదేశిస్తూ విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారు.