calender_icon.png 19 April, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం లేకున్నా ఎక్స్‌టెన్షన్ ఎందుకు..?

25-03-2025 12:00:00 AM

  • 25 జిల్లాల్లో 314 మిల్లుల్లో ర్యాండమ్‌గా తనిఖీ.. టన్నుల ధాన్యం లేనట్లు గుర్తింపు

2022- యాసంగిలో 5.40 లక్షల టన్నుల ధాన్యం ఏమైనట్టు?

చర్యలకు అధికారులెందుకు వెనుకాడుతున్నట్టు?

మంచిర్యాల, మార్చి 24 (విజయక్రాంతి) :తెలంగాణ రాష్ట్రంలో 2022 యాసంగి సీజన్‌లో అనుకున్నదానికంటే పెద్ద మొత్తం లో వరి పంట సాగయి అధిక ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరింది. అధికారులు మిల్లులకు సామర్ధ్యానికి మించి కేటాయించడంతో పాటు గోదాములలో ధాన్యం నిలువ చేశారు.

మిల్లర్లు మిల్లింగ్ చేసి గడువులోపు సీఎంఆర్ ఇవ్వలేమని చెప్పడంతో సివిల్ సప్లయ్ అధికారులు గోదాముల్లోని ధాన్యంతోపాటు మిల్లులకు పంపించిన ఎక్సెస్  ధాన్యానికి వేలం వేయగా హైదరాబాద్ కేంద్రీయ భండార్ సంస్థ 28 జిల్లాల్లోని 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దక్కించుకుంది.

గత ఏడాది డిసెంబర్ వరకు దాదా పు 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించింది. తర్వాత తరలిద్దామంటే ధాన్యం లేకపోవడంతో సివిల్ సప్లయ్ కమిషనర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్సు, ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ బృందా లు రంగంలోకి దిగాయి.

5.40 లక్షల టన్నుల కొరత

2022- యాసంగి సీజన్‌కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మిల్లింగ్ కోసం ధాన్యం దింపుకున్న 28 జిల్లాల్లో సివిల్ సప్ల య్ విజిలెన్స్,  ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు 25 జిల్లాల్లో ర్యాండమ్‌గా కొన్ని (314) మిల్లులను తనిఖీ చేయగా 5.40 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పార్టేజ్ ఉన్నట్లు సివిల్ సప్లయ్ కమిషనర్‌కు నివేదిక అందజేశాయి. 

ఆ షార్టేజ్ ధాన్యం ఏమైంది..?

2022 యాసంగి సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా  టార్గెట్‌కు మించిన ధాన్యం రావడంతో రాష్ట్ర ప్రభుత్వం మిల్లుల సామర్థ్యం మేరకు కేటాయించిన ధాన్యం పోగా మిగిలి న ధాన్యాన్ని వేలం వేశారు. యాక్షన్ ధాన్యా న్ని తీసుకుపోదామంటే మిల్లుల్లో లేకపోవడంతో కమిషనర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయ్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందా లు ర్యాండమ్‌గా అన్ని జిల్లాల్లోని 314 మిల్లులను తనిఖీ చేసి 5,40,017.346 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు నివేదిక అందజేశారు.

అసలు ఈ షార్టేజ్ ధాన్యం మిల్లుల్లో లేకుండా ఏమైంది..! అధికారులు ఈ విషయంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? ధాన్యమంతా సదరు మిల్లర్లు అమ్ముకున్నారా..! కొన్ని మిల్లులనే తనిఖీ చేస్తేనే ఇంత ధాన్యం మాయమైతే అన్ని జిల్లాలోని అన్ని మిల్లుల్లో తనిఖీ చేస్తే ఇంకెంత షార్టేజి వస్తుందో..! అనే ప్రశ్నలు తలెత్తుకున్నాయి.

ఎవరిని కాపాడేందుకు..?

2022- యాసంగి వేలం వేసిన ధాన్యం మిల్లుల్లో లేదని సివిల్ సప్లయ్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత ఈ (మార్చి) నెలలో మరో మూడు నెలలు ఎక్స్ టెన్షన్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. అసలు మిల్లుల్లో ధాన్యమే లేకుంటే సివిల్ సప్లయ్ ఉన్నతాధికారులు ఎందుకు ఎక్స్‌టెన్షన్ ఇస్తున్నారు..! ఎవరిని కాపాడేందుకు ఇస్తున్నారో అర్థం కాని ప్రశ్నలా మారింది.

మిల్లుల్లో ధాన్యం ఉంటే సీఎంఆర్ ఏండ్లకు ఏండ్లుగా బకాయిలు ఎందుకు పెడుతారు..! చర్యలకు రంగం సిద్ధం చేయాల్సిన అధికారులు కాలయాపన ఎవరి కోసం చేస్తున్నారో.. వారికే తెలియాలని సక్రమంగా సీఎంఆర్ ఇస్తున్న కొందరు మిల్లర్లు పేర్కొనడం గమనార్హం.

వేల కోట్ల ధాన్యం గయాబ్?

రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 7,650 కోట్ల రూపాయల విలువజేసే 38,01,163 మెట్రిక్ టన్నుల ధాన్యానికి పౌరసరఫరాల శాఖ వేలం వేసింది. గత ఏడాది డిసెంబర్ వరకు మిల్లులు, గోదాముల నుంచి సుమారు 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బిడ్డర్ తీసుకెళ్లినట్లు సమాచారం. ఇంకా సుమారు నాలుగు వేల కోట్లకు పైగా ధాన్యం మిల్లుల్లో ఉండాల్సి ఉంది.

సంబంధిత శాఖ అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్‌లో  ధాన్యం మిల్లుల్లో లేవని గుర్తించారు. వేల కోట్ల విలువజేసే ధాన్యం ఏమైనట్లో సంబంధిక శాఖ అధికారులు విచారణ చేపడితే అసలు కథా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు మేధావులు, సక్రమంగా ప్రభుత్వానికి సీఎంఆర్ ఇచ్చే మిల్లర్లు పేర్కొంటున్నారు.