calender_icon.png 21 November, 2024 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఎందుకు?

10-11-2024 01:34:12 AM

  1. యాదాద్రి జిల్లా అధికారులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్
  2. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేదని ఆగ్రహం

యాదాద్రిభువనగిరి, నవంబర్ 9 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై యాదాద్రిభువనగిరి జిల్లా అధికారులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు రెండు నెలలుగా కల్లాల్లో రాశులు పోసుకుంటే కొనుగోళ్లు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు.

బీజేపీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా కిషన్‌రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో  కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. కోతలు చేపట్టి రోజులు గడుస్తున్నా అధికారులు  ధాన్యం కొనుగోలు చేయడం లేదని  వాపోయారు.

దీంతో స్పందించిన కిషన్‌రెడ్డి.. వెంటనే యాదాద్రి కలెక్టర్ హనుమంతరావుకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అదనపు కలెక్టర్ వీరారెడ్డికి ఫోన్ చేసి జిల్లాలో ధాన్యం కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోలుకు అవసరమైన నిధులు, రవాణా, గోనె సంచులు, హమాలీ ఛార్జీలు కేంద్రమే భరిస్తోందని.. అయినప్పటికీ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ధాన్యం కళ్లాల్లో మొలకలు వస్తుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. వీలైనంత తర్వగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.