calender_icon.png 1 February, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు భరోసాకు కోడ్ సాకెందుకు!

01-02-2025 01:07:21 AM

  1. అది అప్పటికే అమలులో ఉన్న పథకం
  2. కేంద్రమంత్రి బండి సంజయ్ 

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. రైతు భరోసా పథకం కొనసాగుతున్న స్కీమే అయినందున ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు.

ఈ ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవి అయినందున ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలు కూడా లేవన్నారు. అవసరమైతే బీజేపీ పక్షాన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ పంపేందుకు సిద్ధమన్నారు.

తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి రైతు భరోసా సహా ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులను వెంటనే ఎంపిక చేసి మంజూరు చేయాలని కోరారు. కోడ్ సాకుతో ఆయా పథకాలను నిలిపేందుకు చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

ఒకవేళ ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తే అఖిలపక్షంతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా పైసలు జమ చేసేందుకు అనుమతి తీసుకుందామని చెప్పారు. ఇప్పటికే ఏడాది పాటు రైతు భరోసా పైసలు అందక రైతులు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు.

ఈ నెలలోనైనా ప్రస్తుతం గిట్టుబాటు ధర రాక, పంట పెట్టుబడులు పెరిగి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ తరుణంలో చేతికందే సొమ్మును కూడా ఆపేస్తే రైతు నోట్లో మట్టికొట్టినట్టే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని..

వీరిలో 40 వేల మందికి మాత్రమే మంజూరు చేసి, మిగిలిన 99 శాతం మంది పేదల కడుపు కొట్టడం సరికాదన్నారు. 10 లక్షల మంది వ్యవసాయ కూలీల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎకరాకు రూ.12 ఇస్తానన్న హామీ ఇచ్చిన ప్రభుత్వం 20,336 మంది ఖాతాల్లోనే డబ్బులు జమ చేసి.. మిగిలిన 9 లక్షల 79 వేల మందికిపైగా కూలీలకు జమ చేయకపోవడం అన్యాయమన్నారు.

రాష్ర్టవ్యాప్తంగా ఇండ్ల కోసం అందిన 70 లక్షలకు పైగా దరఖాస్తుల్లో.. దాదాపు 40 లక్షల మంది పేదలు ఇండ్లకు అర్హులని తేలితే ఇప్పటి వరకు 72,406 మందికి మాత్రమే ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసి మిగిలిన వారిని ఎంపిక చేయకపోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే ప్రతీ లబ్ధిదారుడికి రైతు భరోసా సొమ్ము వేయడంతోపాటు మిగిలిన 3 పథకాలకు సంబంధించి లబ్ధి చేకూర్చే ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేశారు.