calender_icon.png 29 October, 2024 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సభకు రాకుంటే ప్రతిపక్ష హోదా ఎందుకు?

30-07-2024 12:20:11 AM

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్‌పై ఫైర్

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): విద్యుత్తుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు రాకుంటే ఎలా? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సభకు రానప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఎందుకని, వేరే వాళ్లు ఎవరైనా తీసుకోవానలి చెప్పారు. విద్యుత్తు రంగాన్ని, ప్రాజెక్టులను సంక్షోభంలోకి నెట్టింది ఆయనేనని ఆరోపించారు. కేసీఆర్ సభకు వస్తే తప్పొప్పులు చర్చించొచ్చని, సలహాలు సూచనలు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్తు శాఖపైన శ్వేత పత్రం విడుదల చేసి వివరించామని చెప్పారు. రాజీకీయ ప్రయోజనాల కోసం సభను వాడుకోవద్దని బీఆర్‌ఎస్ సభ్యులకు హితవుపలికారు.

భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో సూపర్ క్రిటికల్ అందుబాటులో ఉన్నా సబ్ క్రిటికల్ ఓల్డ్ టెక్నాలజీ వాడటంతో నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు. ఈ విషయాన్ని ఆ ప్లాంట్ అధికారి లేఖలో వివరించారని చెప్పారు. విద్యుత్తు రంగాన్ని అప్పుల నుంచి బయట పడేసేందుకు  తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని స్పష్టంచేశారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిన తప్పులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అక్కడ నిర్మించాల్సింది కాదని, అది లాభదాయకం కాదని 2018లోనే చెప్పానని పేర్కొన్నారు. ఈ ప్లాంట్ పూర్తి చేసేందుకు అదనంగా రూ.11 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని చెప్పారు. ఇప్పటివరకు యాదాద్రి పవర్ ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆందోళన వ్యక్తంచేశారు.

రామగుండంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉన్నా.. అక్కడ కాకుండా యాదాద్రిలో ఎందు కు నిర్మించారో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ గత పదేళ్లు ఓ రాజులా వ్యవహరించారని, ఐఏఎస్‌లతో కాళ్లు మొక్కించుకున్న చరిత్ర కేసీఆర్‌ది అని విరుచుకుపడ్డారు. 24 గంటల విద్యుత్‌ను బీఆర్‌ఎస్ ఇవ్వలేదని, 14 గంటలే ఇచ్చిందని చెప్పారు. ఉచిత విద్యుత్తు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు చేసిన అవినీతి చిట్టా అంతా బయటకు వస్తుందని, మాజీ సీఎస్ సోమేశ్ లోపలికి వెళ్లబోతున్నారని, త్వరలో మీరు కూడా అని బీఆర్‌ఎస్ నాయకులను ఉద్దేశించి అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తాము ప్రశ్నిస్తే తమపై కౌరవుల్లా దాడికి వచ్చారని.. సారు, కారు, పదహారు అన్నసారు ఎక్కడికిపోయారని ఎద్దేవా చేశారు.