26వేల కోట్లు మేమిస్తే.. మాకు ఒక్క రూపాయి ఇవ్వరా?
- కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం
- ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం
హైదరాబాద్, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి పన్నులు రూపంలో కేంద్రానికి రూ.26వేల కోట్లు వెళ్లాయని, గతంలో కంటే 12శాతం నిధులు పెరిగినా తమ రాష్ర్టంపై చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్నారు.
శనివారం లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మంత్రి తీవ్రంగా స్పందించారు. కేంద్రం కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలకే దక్కాయని మండిపడ్డారు. కేంద్ర జీడీపీలో తెలంగాణ వాటా ఐదు శాతమని, కానీ ఆ మేరకు నిధులను కేటాయిం చలేదన్నారు.
బీజేపీకి 8మంది ఎంపీలను ఇచ్చిన తెలంగాణ ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందని మండిపడ్డారు. బిహార్, ఢిల్లీ, ఏపీ, గుజరాత్‌లకు మాత్రమే బడ్జెట్‌లో ప్రాధాన్యమివ్వడం అంటే కక్ష సాధింపు కాదా? అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పలుమార్లు ప్రధానితో సహా కేంద్ర మంత్రులను కలిసి సాయం చేయాలని కోరినట్లు గుర్తు చేశారు. మెట్రో ప్రాజెక్టు, ఫోర్త్ సిటీ, భూగర్భ డ్రైనేజీ నిర్వహణ, మూసీ ఇలా కీలక ప్రాజెక్టులకు ప్రతిపాదలను పంపినా రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం రూ.4వేల కోట్లు అడిగితే కేంద్రం నిరాశ పర్చిందన్నారు.
ప్రతి బడ్జెట్‌లోనూ ఇదే ధోరణి
బీజేపీ దృష్టిలో మాత్రం దేశమంటే ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాలు మాత్రమే అన్నట్లు ఉందని, సమాఖ్య స్ఫూర్తిని ఆ పార్టీ విస్మరిస్తోందని మంత్రి మండిపడ్డారు. ప్రతి బడ్జెట్‌లోనూ ఇదే ధోరణిని అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. అందులో భాగంగానే బిహార్‌పై వరాల జల్లు కురిపించారని చెప్పారు. తలసరి ఆదాయం, వృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణకు మొండిచేయి చూపించడం తగదన్నారు.
రాష్ట్రానికి ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ, నవోదయ, సైనిక్ స్కూల్స్‌ను కేటాయించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరి నా రూపాయి ఇవ్వలేదన్నారు. పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిన కో ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం సహా సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయించాలని కోరినా విస్మరించారన్నారు.