calender_icon.png 27 October, 2024 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్షన్నర కోట్లు ఎందుకు?

22-07-2024 01:23:34 AM

మూసీ ముస్తాబు వెనుక మతలబు ఏమిటి: కేటీఆర్

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): మూసీ నదిని ముస్తాబు చేసేం దుకు రూ.1.50 లక్షలు కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెప్పడం వెనుక మతలబు ఏమిటని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నిలదీశారు. ఆదివారం ఎక్స్ వేదికగా స్పంది స్తూ, తెలంగాణ రైతుల తలరాత మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 80 కోట్లు ఖర్చు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వరకు గగ్గోలు పెట్టిందని విమర్శించారు. మూసీ  సుందరీకరణకే రూ. 1.50 లక్షల కోట్లా.. పదిహేను పక్కన ఇన్ని సున్నాలా 15,000,000,000,000 అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు.

ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరని, నిల్వ ఉంచే టీఎంసీలు ఎన్ని ఎకరాలను సాగులోకి తెస్తాయని ప్రశ్నించారు. పెరిగే పంటల దిగుబడి ఎంత అన్నారు. తీర్చే పారిశ్రామిక అవసరాలెంత.. కొత్తగా నిర్మించే  భారీ రిజర్వాయర్లు ఎన్ని అని ప్రశ్నించారు. పుట్టిన గడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై కంటే మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువని పేర్కొన్నారు. చివరి దశలో ఉన్న ప్రాజెక్టును పక్కన బెట్టి మూసీ చుట్టూ ఎం దుకింత  మంత్రాంగం అంటూ సందేహం వ్యక్తం చేశారు.

లండన్‌లోని థేమ్స్ నదిలాగా మారుస్తామనే వ్యుహం వెనక థీమ్ ఏంటి, గేమ్ ప్లాన్ ఏమిటని ప్రశ్నించారు.  సీఎం రేవంత్‌రెడ్డి మూడింతలు పెంచిన మూసీ అంచనా వ్యయం కాంగ్రెస్ ధన దాహానికి సజీవ సాక్ష్యమన్నారు. మూసీ ప్రాజెక్టును చేపట్టాల్సిందేనని, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సిందేనని, కానీ మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టులో మూటలు పంచుకునే పని మొదలు పెడితే సహించేదిలేదని హెచ్చరించారు.  తట్టెడు మట్టి కూడా తీయక ముందే కోట్లు తన్నుకపోయే కుట్రకు తెరదీస్తే భరించబోమని స్పష్టం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరిట బ్యాక్ డోర్‌లో జరుగుతున్న బాగోతం తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోందన్నారు. .