calender_icon.png 30 October, 2024 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీరు ఎందుకు అందట్లేదు?

04-07-2024 12:58:05 AM

గతంలో నీటి ఎద్దడి లేదని ప్రకటించారు..  

అది కూడా బోగస్ ప్రకటననేనా?: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): మిషన్ భగీరథకు రూ.42 వేల కోట్లు ఖర్చు చేసినా మళ్లీ అదనపు నిధులు ఎందుకని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతోందని గతంలో అసెంబ్లీలో సర్పంచుల సంతకాలతో సహా ప్రకటించి కేంద్రానికి నివేదిక పంపారని గుర్తు చేశారు. ఇప్పుడు 1,150 ఆవాసాలకు 50 శాతం నీళ్ల సరఫరానే చేస్తున్నామని చెప్పడమేంటని ప్రశ్నించారు. అంటే అప్పటి ప్రకటన బోగస్ అని భావించాలా అని అధికారులను భట్టి నిలదీశారు. బుధవారం సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి మిషన్ భగీరథ అధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు. రాష్ర్టంలో 23,824 ఆవాసాలు ఉండగా 1,156 ఆవాసాల్లో 50% మాత్రమే నీళ్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు.

ఆలేరు, భువనగిరి, నల్లగొండ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందడం లేదని, అదనపు నిధులు కావాలని మీ శాఖ నుంచే ఫైల్ రావడం ఏంటని ప్రశ్నించారు. మిషన్ భగీరథపై ప్రస్తుత సర్వే ఎప్పుడు పూర్తవుతుందని అడిగారు. సర్వే పూర్తికాగానే రాష్ర్టంలోని ఎమ్మెల్యేలకు ఆ నివేదికలు అందజేసి తాగునీరు అందుతుందన్న విషయాన్ని వారి ద్వారా నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. తాగునీటి సరఫరాకు ప్రధాన సోర్స్‌ను వందల కిలోమీటర్ల నుంచి కాకుండా సమీపంలో నుంచి తీసుకోవాలని భట్టి సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి పంపిణీ వల్ల తరచూ పైప్‌లైన్‌లు పగిలి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. మిషన్ భగీరథలో సిబ్బంది జీతాలు నెలల తరబడి ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నాయని ప్రశ్నించారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా వేతనాలు ఉన్నాయని, ప్రభుత్వ అందిస్తున్న వేతన నిధులను ఏజెన్సీలు కాజేసి కార్మికులకు తక్కువ జీతాలు ఇస్తున్నారని మంత్రి మండిపడ్డారు. దీనిపై సమీక్ష చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.