హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): అత్యాచారానికి గురై తీవ్ర భయబ్రాంతుల్లో ఉన్న అంధ బాలిక వాంగ్మూలాన్ని ఇంటి వద్ద తీసుకోవడానికి అభ్యంతరం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణలోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. హైదరాబాద్ మలక్‌పేటలోని అంధ బాలికల వసతి గృహంలో అంధ బాలికపై బాత్రూమ్‌లు కడిగేందుకు వచ్చిన నరేశ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. తీవ్ర రక్తస్రావంతో బాలిక అస్వస్థతకు గురైంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గత నెల 16న పోక్సో చట్టం కింద మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో మేజిస్ట్రేట్ ముందుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని దర్యాప్తు అధికారి బాలికపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఆమె తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.