29-03-2025 12:21:21 AM
రూ.92.20 లక్షలకే చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లు
గత ఏడాది రూ. 1.27 కోట్లకు టెండర్
ఏటా పెంచాల్సిన ఆదాయాన్ని తగ్గిస్తున్నరు
హుస్నాబాద్, మార్చి 28 : తెలంగాణలోనే పెద్దదైన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంగడి బల్దియాకు అత్యధిక ఆదాయ వనరుగా ఉంది. కోట్ల రూపాయల క్రయవి క్రయాలు జరిగే ఈ వారసంత నిర్వహణ బాధ్యతను తక్కువ రూపాయలకే అప్పజెప్పడం అనుమానంగా ఉంది. మున్సిపల్ అధికారుల అసమర్ధతనో, లోపాయకారి ఒప్పందాలో, కాంట్రాక్టర్ల సిండికేట్ ఫలితమో గానీ, ఈసారి భారీగా ఆదాయం తగ్గింది.
కాంట్రాక్టర్లు రూ.92,20,667కే అంగడిని సొంతం చేసుకున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా అంగడితో ఆదాయం పెరుగు తూ వస్తోంది. నిబంధనల ప్రకారం అధికారులు వేలాన్ని పెంచుతూ పాట పాడాల్సి ఉంది. గత ఏడాది రూ.1.27 కోట్లకు అంగడిని వేలంలో పొందిన కాంట్రాక్టర్లు ఈసారి రూ.92.20 లక్షలకే దక్కించుకున్నారు. దీం తో సుమారు రూ.35 లక్షల ఆదాయం బల్దియాకు రాకుండా పోయింది.
అయితే ఏటా పది శాతం మేరకు పెంచుతూ పాట పాడాల్సిన అధికారులు తక్కువకే వేలం వేయడం అనుమానాలకు తావిస్తోంది. మొదట గతేడాదికంటే ఎక్కువకు పాడేందుకు కాంట్రా క్టర్లు ముందుకు రాలేదని అధికారులు చెబుతున్నారు. తక్కువ మొత్తానికి టెండర్ దక్కించుకోవాలని కాంట్రాక్టర్లు ప్రయత్నించారు. అయితే కొందరు రాజకీయ నాయకులు వ్యతిరేకించడంతో వేలంపాట మూడుసార్లు వాయిదా పడింది.
ఇప్పుడు పధ్నాలుగు మంది కాంట్రాక్టర్లు ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం గతేడాది వచ్చిన ఆదాయం రూ.1.27 కోట్ల నుంచి పాట ప్రారంభించాలి. ఎవరి ఒత్తిడి ఫలితంగానో నిబంధనలు సడలించి రూ.92,10,600 నుంచి వేలం పాడారు. కాంట్రాక్టర్ అయిలేని కిషన్ రెడ్డి రూ.92, 20,667కే అంగడిని దక్కించుకున్నారు. ఏటా పెరగాల్సిన అంగడి ఆదాయం భారీగా తగ్గడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాంట్రాక్టర్లు సిండికేట్ ఆయ్యారా?
అంగడి వేలంలో కాంట్రాక్టర్లు సిండికేట్గా మారారని పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ టెండర్ రద్దు చేసి, కొత్తగా మళ్లీ వేలం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు వారు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
అంగడి కాంట్రాక్టు కోసం కొత్తగా ఎవరూ ముందు కు రాకుండా డిపాజిట్ ను భారీగా పెంచి, అయినవారికి తక్కువ మొత్తానికే కట్టబెట్టారని అంటున్నారు. ఈ వ్యవహారంపై విచార ణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
* కాంట్రాక్టర్లు ముందుకురావడంలేదు..
హుస్నాబాద్ అంగడి నిర్వహణ బాధ్యత చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. హుస్నాబాద్ చుట్టుపక్క గ్రామా ల్లో కూడా వారసంతలు నిర్వహిస్తుండడంతో హుస్నాబాద్ అంగడికి జనం రావడంలేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. మూడుసార్లు వేలం వేసినా వారు పాల్గొనలేదు. అందుకే వేలాన్ని తగ్గించి పాటపాడాం.
మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్