calender_icon.png 22 October, 2024 | 11:05 PM

రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం ఎందాక?

22-10-2024 12:00:00 AM

కోలాహలం రామ్ కిశోర్ :

రాష్ట్రాల యూనియన్‌గా ఉన్న దేశాన్ని కేంద్రం హస్తగతం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్య విధానాన్ని అమలు జరిపాలి. ఫెడరల్ ప్రభుత్వంగా తిరిగి పునఃస్థాపితం చేయాలి. రాజ్యాంగంలో చెప్పినట్లు పరస్పర సహకారంతో కేంద్ర- రాష్ట్రాలు ఘర్షణలు వీడి కోఆపరేటివ్ ఫెడరల్ విధానాన్ని అనుసరించాలని కోరుకుందాం.

కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధుల్ని భారత రాజ్యంగం స్పష్టంగానే నిర్వచించింది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, నిధుల పంపిణీల్లో సహేతుకంగా నిర్దిష్ట నియమాలను ఏర్పర్చింది. అయినా కేంద్రం, రాష్ట్రాల హక్కుల ను 2014 నుంచి క్రమంగా హరిస్తూ వస్తున్నది. రాష్ట్రాల ఆర్థిక వనరులను కొల్లగొడు తూ వాటి పాలనా స్వేచ్ఛను పరిమితం చేస్తున్నది.

రాష్ట్రాలు విధి లేక కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నది. రాష్టాలు స్వయంగా తన పరిధిలో పన్నులు విధించి, వసూలు చేసి వినియోగించుకోనే స్వేచ్ఛను రాజ్యాంగ రీత్యా వాటికి సంక్రమించింది. కానీ, బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా రాష్ట్రాల ఆర్థిక స్వాలంబనా హక్కులపై దాడి చేస్తోంది.

ఆర్థిక హక్కులు, అవకాశాలు కోల్పోయిన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై సాగిలపడేలా  చేస్తున్నది. ఫలితంగా ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలు, తాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేని దీన స్థికి నెట్టివేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలతో విభేదించిన రాష్ట్రాలను ఆర్థికంగా ఇక్కట్ల పాలు చేస్తున్నది.

పార్టీ ఫిరా యింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామికంగా ఎన్నికైన విపక్ష ప్రభుత్వాలను నిర్ల జ్జగా పడగొడుతున్నది. కేంద్రీకృత నియంతృత్త్వ పోకడలకు పాల్పడుతున్నది. 

ఆర్థిక హక్కులు హరిస్తున్నది

కేంద్ర ప్రభుత్వం సంప్రదాయంగా వస్తున్న ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిం ది. దాని స్థానంలో ‘నీతి అయోగ్’ వ్యవస్థను తెచ్చింది. 1951 నుంచి పంచవర్ష ప్రణాళికలతో రూపొందించిన కార్యక్రమాల అమలుతో దేశం అన్ని రంగాల్లో ప్రగతి దిశగా పయినించింది. ప్రతీ వార్షిక ప్రణాళికకు నిర్దిష్ట లక్ష్యాల సాధనకు నిధు లు కేటాయించింది. ఆయా రంగాల అభివృద్ధి సాధ్యమైంది.

ఆచరణలో లోపాలు దొర్లితే వాటిని సరిదిద్దే ప్రయత్నం జరిగింది. కానీ, నేటి ‘నీతి అయోగ్’ వ్యవస్థ ఏర్పడిన అనంతరం రాష్ట్రాల ఆర్థిక హక్కులకు అవస్థలు తప్పటం లేదు. ప్రణాళికా బోర్డు రద్దుతో క్రమంగా దేశాభివృద్ధి గణనీయంగా కుంటుబడింది. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌకగా వాటికి కట్టబెడుతున్నది.

ప్రస్తుతం 120 భారీ పరిశ్రమల ను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసింది. లక్షల కోట్ల లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అప్పణంగా అప్పజెప్పడంతో ఆ సంస్థల యజ మానులు అదానీ, అంబానీలు ప్రపంచ కుబేరవర్గ జాబితాలో అనతి కాలంలోనే రెండు, మూడు స్థానాలకు ఎగబాకారు. ప్రజలు మాత్రం దారిద్య్రంలో మునకలు వేస్తున్నారు. అయినా, ఈ అమ్మకపు ప్రక్రియ అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంది.

రాష్ట్రాల ఆదాయానికి గండి

మార్చి 1998 నుంచి మే 2004 వరకు అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో జీఎస్టీ ప్రతిపాదన తెచ్చారు. ‘ఒకే దేశం ఒకే పన్ను’ విధానాన్ని రూపొందించి, బహు పన్నుల విధానాన్ని రద్దు చేయాలని సెలవిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. ఇప్పుడు కేంద్రంలో తమకున్న బలంతో బిల్లును ఆమోదింపజేసుకుని, బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది.

ప్రధాని అధ్యక్షతలో ముఖ్యమంత్రులను, రాష్ట్రాల ఆర్థిక మంత్రులను సభ్యులుగా చేశారు. 2015 నుంచి జీఎస్టీని కౌన్సిల్ నిర్వహించి అమలు చేస్తున్నారు. 3 శాతం, 5 శాతం, 8 శాతం,12 శాతం, 28 శాతంగా కేటగిరీలను నిర్ణయించారు. గతంలో వచ్చే ఆదాయం తగ్గితే ఆ రాష్ట్రాలకు ఐదు సంవత్సరాల వరకు పరిహారం చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.

కానీ, ఆ హామీని అమలు జరపడానికి నిధుల కొరతను కారణంగా చూపుతూ వాయిదాలు వేస్తు న్నారు. ప్రతిపక్ష రాష్ట్రాలకు నిధుల విడుదల్లో పక్షపాతం చూపుతూ జాప్యం చేయ డం వల్ల ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవా కార్యక్రమాలు మధ్య లో ఆగిపోతున్నాయి.

తిరిగి ప్రారంభించే నాటికి ధరలు పెరుగుతూ నిర్మాణ వ్యయం అధికమవుతున్నది. జీఎస్టీలో కేంద్రం పన్ను, రాష్ట్రాల పన్ను, సమగ్ర పన్నుల పేర్లతో వసూళ్ళు సాగిస్తున్నారు. కేంద్రంతో సమానంగా రాష్ట్రాల పన్నును వసూలు చేస్తున్నప్పటికీ కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఆదాయం బాగా తగ్గింది.

స్థానిక సంస్థలకు నిధుల కొరత

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక కమిషన్లు వేసి తమకు వచ్చే పన్నుల్లో కొంతభాగాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం 15వ ఆర్థిక కమిషన్ (2021 అమలవుతున్నది. ఈ కమిషన్ ముందస్తుగానే రాష్ట్రాలకు పన్నుల వాటా నిర్ణయిస్తుంది. 13వ ఫైనాన్స్ కమిషన్‌లో (2010 రాష్ట్రాలకు 32 శాతం వాటా ఉండగా, 14వ ఫైనాన్స్ కమిషన్‌లో (2016- 2020) 42 శాతంగా పెంచారు.

15వ ఫైనాన్స్ కమిషన్‌లో తిరిగి తగ్గించి 41 శాతంగా నిర్ణయించారు. రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు 15వ ఫైనాన్స్ కమిషన్ కాలానికి రూ.2,94,514 కోట్లు కేటాయించాలని కమిషన్ సూచించింది. అలాగే స్థానిక సంస్థలకు, ఆరోగ్యానికి, ప్రకృతి వైపరీత్యాలకు, పాఠశాల, ఉన్నత విద్యకు, వ్యవసాయ సంస్కరణలకు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కలిపి రెవెన్యూ లోటుసహా రూ.10,33,062 కోట్లు కేటా యించింది.

అంటే, ఏడాదికి రూ.2.60 లక్షల కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. ప్రస్తుతం కేంద్రానికి ఏటా రూ. 27,57,820 కోట్లు పన్నుల రూపంలో వస్తున్నది. ఇందులో 10 శాతం కూడా రాష్ట్రాలకు కేటాయించలేదు. ఈ విధంగా ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాల కేటాయింపులను తగ్గిస్తూ రావడంతో స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు)కు నిధుల కొరత ఏర్పడింది. దీనికి తోడు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కూడా క్రమంగా తగ్గిస్తూ వస్తున్నది. 

ఆర్థిక విధానాలతో కొత్త సమస్యలు

కేంద్రం ఆర్భాటంగా ప్రకటించిన సబ్సిడీలన్నిటికీ క్రమంగా కోత పెట్టడంతో బలహీనవర్గాల వారిలో కొనుగోలు శక్తి బాగా క్షీణించింది. నేటికీ 140 కోట్ల జనాభాలో సుమారు 80 కోట్లమంది అర్ధాకలితో ఉన్నట్లు జాతీయ, అంతర్జాతీయ దారిద్య్ర నివేదికలు చెబుతున్నాయి. సుమారు 37 కోట్లమంది కటిక దారిద్య్రంలో ఉన్నట్లు సర్వేల ఫలితాలు చెబుతున్నాయి.

అయినా, ప్రభుత్వం దారిద్య్రం నిర్మూలనకు గట్టిగా కృషి చేయటం లేదు. కాగా, ఇలాంటి పరిస్థితుల్లోనూ కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్ట డానికే ఆర్థిక విధానాలు రూపొందించి అమలు చేయటం శోచనీయం. అందులో భాగంగా 27 జాతీయ బ్యాంకులను 12 బ్యాంకులుగా కుదించారు.

అందులో నిధులను ఒకచోట పోగేసి, గతంలో అప్పులు తీసుకుని ఎగవేసిన వారికే తిరిగి రుణాలు ఇచ్చే విధంగా రిజర్వు బ్యాంకుపై కేంద్రం ఒత్తిడి తెస్తున్నది. దానితో అది ఇతర బ్యాంకులకు అదే విధంగా సూచనలు చేయక తప్పటం లేదు. ఈ సూచనలతో విభేదించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు తమంతట తాము పదవుల నుంచి తప్పుకొనేలా కేంద్రం ఒత్తిడి తెచ్చింది.

ఈ విషయంలో బహిరంగంగా ఆర్థికవేత్తలు నిరంతరం చర్చలు జరుపుతూ సూచనలు, హెచ్చరికలు చేస్తున్నా మోదీ ప్రభుత్వం మాత్రం తన పంథాను మార్చుకోకుండా బ్యాంక్ రుణాలు ఎగవేసిన డిఫాల్టర్లకే మద్దతు తెలుపుతున్నది. ఆ రుణ ఎగవేతదార్లకే (కార్పొరేట్ వర్గాలకు) రూ.12 లక్షల కోట్ల రుణాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది.

అంతేకాక, ప్రభుత్వరంగ సంస్థలను బుక్ వాల్యూ కన్నా తక్కువ ధరకు కార్పొరేట్ సంస్థలకు అంట గడుతున్నది. భారీ పరిశ్రమలైన జీవిత భీమా సంస్థ, గనులు, విద్యుత్, ఓఎన్జీసీ లాంటి ప్రభుత్వరంగ సంస్థలను సైతం అడ్డగోలుగా వాటాల ఉపసంహరణల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేస్తున్నారు.

రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలనూ అమ్మివేసి ఉద్యోగులను తగ్గించడమో, జీతాలలో కోత పెట్టడమో చేస్తున్నారు. కార్మికుల హక్కులను మొత్తంగా హరించి వేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రాల ఆర్థిక హక్కులను కాజేసి వాటిని దివాళా తీయించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల ప్రజల ఉపాధినీ దెబ్బ తీస్తున్నారు. విద్యా, వైద్య మౌలిక వసతులకు దూరం చేస్తున్నారు.

రాష్ట్రాల యూనియన్‌గా ఉన్న దేశాన్ని కేంద్రం హస్తగతం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్య విధానాన్ని అమలు జరిపాలి. ఫెడరల్ ప్రభుత్వంగా తిరిగి పునఃస్థాపితం చేయాలి. రాజ్యాంగంలో చెప్పినట్లు పరస్పర సహకారంతో కేంద్ర- రాష్ట్రాలు ఘర్షణలు వీడి కోఆపరేటివ్ ఫెడరల్ విధానాన్ని అనుసరించాలని కోరుకుందాం.  

వ్యాసకర్త సెల్: 9849328496