ప్రముఖ నటి నయనతార, హీరో, నిర్మాత ధనుష్ మధ్య వివాదానికి కారణమైన ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రంలో ఏముంది? ఎందుకు నయనతారకు ఆ సినిమా అంత ప్రత్యేకంగా మారిందో తెలుసుకుందాం. ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఆమెకు విఘ్నేశ్‌కు ఈ సినిమా ద్వారానే పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా.. ఆపై పెళ్లికి దారితీసింది. 2011లో నయనతార ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో సీత పాత్ర పోషించారు. ఆ సమయంలోనే తాను సినిమాలకు గుడ్‌బై చెప్పినట్టు ప్రకటించారు.
కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమ.. పెళ్లి పీటల వరకూ వచ్చి ఆగిపోవడం వంటి అంశాలతో ఆమె చాలా క్రుంగిపోయారు. ఆ తరువాత నయనతా రను 2013లో దర్శకుడు అట్లీ ‘రాజు రాణి’ చిత్రం ద్వారా సినిమాల్లోకి తీసుకొచ్చారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత వరుస ఫెయిల్యూర్స్ వచ్చాయి. రెండేళ్ల తర్వాత ‘మాయ, థరు ఒరువన్’ చిత్రాలు ఆమె కెరీర్‌ను పీక్ స్థాయికి తీసుకెళ్లాయి. 2015లో ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రంతో నయనతార హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి గురించి రూమర్స్ వెల్లువెత్తాయి. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ చిత్రంలో వినికిడి లోపం ఉన్న కాదంబరి అనే మహిళగా నయనతార చేసిన పాత్ర బాగా హైలైట్ అయ్యింది. ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన రూమర్స్ సైతం నయనతార, విఘ్నేశ్ శివన్‌లను దగ్గర చేసేందుకు దోహద పడ్డాయని చెబుతారు.
తమ జంటను ఏకం చేసిన చిత్రంగానే కాకుండా.. తనకు ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిన చిత్రంగా కూడా నయనతారకు ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఈ క్రమంలోనే ఆమె తన డాక్యుమెంటరీలో ఆ చిత్రాన్ని చేర్చారు. కానీ ధనుష్ దానికి అంగీకరించలేదు. రూ.10 కోట్లు చెల్లించాలంటూ లీగల్ నోటీస్ పంపించారు. దీనిపై నయన్ బహిరంగ లేఖ ద్వారా పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు.