calender_icon.png 2 November, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విగ్రహారాధన ఎందుకు?

19-07-2024 12:00:00 AM

జిడ్డు కృష్ణమూర్తి :

తెలుగువారైన మహాతత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిని ఒకసారి ఒక వ్యక్తి ‘విగ్రహారాధన ఎందుకు?’ అని అడిగారు. దానికి ఆయన సమాధానం.

చెక్కిన విగ్రహంలో దేవుడు లేడని మీరంటారు. కాని, అక్కడే వున్నాడని, మీ హృదయాలలో నమ్మకమున్నట్లయితే ఆ దేవుని శక్తి ప్రకటితమవుతుందని ఇతరులంటారు. మంచి పూజలోని సత్యమేమిటి?

ప్రపంచంలో ఎంతమంది మనుషులున్నారో అన్ని అభిప్రాయాలుంటాయి. అభిప్రాయమంటే ఏమిటో మీకు తెలుసును గదా! మీరొక విధంగా చెబుతారు, మరియొకరు మరియొక విధంగా చెబుతారు. ఎవరి అభిప్రాయం వారిది. కానీ, అభిప్రాయమేదిన్నీ సత్యం కాదు. కాబట్టి, ఎంత గొప్పవారి అభిప్రాయమైనాసరే వినిపించుకోవద్దు. దానిబదులు ఏది సత్యమో, ఏది కాదో మీయంతట మీరే తెలుసుకోండి. రాత్రికి రాత్రి అభిప్రాయాలను మార్చుకోవచ్చు. కాని సత్యాన్ని అట్లా మార్చలేం. సరే, మరి చెక్కిన విగ్రహంలో దేవుడున్నాడా లేడా? అందులో సత్యమున్నదా? లేదా? అనే విషయాన్ని మీయంతట మీరు తెలుసుకోవాలనుకుంటు న్నారు. అంతేనా? చెక్కిన విగ్రహమంటే యేమిటి? అది మనస్సుతో ఊహింపబడి, కొయ్యమీదగాని రాతిమీదగాని చేతితో చెక్కబడింది.

మనస్సు విగ్రహాన్ని ఊహిస్తుంది. అట్లా మనసు ఊహకు అందిన విగ్రహం దేవుడని ఒక లక్షమంది జనులు గట్టిగా బల్లగుద్ది చెప్పినా సరే, మీరది నిజమని అనుకొంటారా? మనసుకు విగ్రహం మీద నమ్మకమున్నట్టయితే, అప్పుడా విగ్రహం మనసుకు శక్తినిస్తుందని మీరంటారు. అందులో మాత్రం సందేహం లేదు. మనసు విగ్రహాన్ని సృష్టిస్తుంది. అంతట తాను సృష్టించిన విగ్రహాన్నుండి శక్తిని పొందుతుంది. మనసు నిరంతరం చేస్తున్న పని అదే. ప్రతిమలను లేదా విగ్రహాలను సృష్టించడం, వాటినుండి బలాన్ని, సుఖాన్ని, ఏదైనా ప్రయోజనాన్ని పొందడం. అందువల్ల ఆ మనసు అంతఃశూన్యమైంది, అంతరిక దారిద్య్రంతో పీడింపబడేది. కాబట్టి, విగ్రహం కాదు ముఖ్యం, లక్షలాది మనుషులు చెప్పేది కాదు ముఖ్యం. మరి ముఖ్యమేమంటే మీ మనసు పనిచేసే తీరును అర్థం చేసుకోవడమే.

మనసు దేవుళ్ళను సృష్టిస్తుంది, నశింపజేస్తుంది. అది దయగలది, దయ లేనిది కూడ. అది ఎంతో అద్భుతాలైన కార్యాలను చేయగల శక్తిగలది. అది అభిప్రాయాలను కలిగి వుంటుంది, భ్రమలను పుట్టింపగలదు. బ్రహ్మాండమైన వేగంతో ప్రయాణం చేయగల జెట్ విమానాలను నిర్మింపగలదు. అందమైన వంతెనలను కట్టగలదు. విశాలమైన రైలు మార్గాలను వేయగలదు. మనిషికంటె మిన్నగా లెక్కలు చేయగల యంత్రాలనూ కనుగొనగలదు. కాని, మనసు సత్యాన్ని సృష్టించలేదు. అది సృష్టించ గలిగింది సత్యాన్ని కాదు, కేవలమొక అభిప్రాయాన్ని, ఒక నిర్ణయాన్ని మాత్రమే. కాబట్టి, సత్యమంటే ఏమిటో మీ అంతట మీరు తెలుసుకోవడం అవసరం.

సత్యమంటే ఏమిటో తెలుసుకోవాలంటే మనసు బొత్తిగా కదలకుండా సునిశ్చలంగా వుండాలి. అట్లా నిశ్చలంగా వుండడమే పూజ చేయడం. పూవులను అర్పించుదామని గుడికి పోవడం గాని, ఆ పోయే దారిలో వున్న బిచ్చగాండ్లను పక్కకు తోసివేయడం గాని పూజ కాదు. మీరు దేవతలకు భయపడతారు. కాబట్టి, వారిని ప్రసన్నం చేసుకొందామని ప్రయత్నిస్తారు. కాని, మీరు చేసేది పూజకాదు. మీరు మీ మనసును అర్థం చేసుకొంటే, అప్పుడది పూర్తిగా నిశ్చలత్వాన్ని పొందితే మీరు దానిని నిలుకడ పొందేట్లు చేయడానికై ప్రయత్నించకుండా, దానంతట అది నిలుకడ పొందితే అప్పుడా నిశ్చలతయే, ఆ నిలుకడయే, పూజించడం. ఇంతేకాదు, ఆ నిశ్చలతలోనే సత్యం, సుందరం, దైవం అని  పిలువబడేదేదో అది ప్రత్యక్షమవుతుంది. 

‘ఈ విషయమే ఆలోచించండి’ నుంచి