రాంగోపాల్ వర్మ.. సినీ దర్శకుడు అన్న పేరు కన్నా ఆయనకు కాంట్రవర్సీ అనే ట్యాగ్‌లైన్ తగిలించేవారే ఎక్కువ. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా సూటిగా సుత్తి లేకుండా తనదైన శైలిలో తన అభిప్రాయాన్ని చెప్పడం ఆర్జీవీకి అలవాటు. ఆయన సెటైరికల్‌గా మాట్లాడుతుంటే కొందరికి ఇబ్బందిగా ఉంటుంది.. ఇంకొన్ని సార్లు ఆయన మాటలు వివాదాస్పద వ్యాఖ్యలుగా వైరల్ అవుతుంటాయి కూడా! వర్మ.. తాజాగా సీనియర్ నటుడు మురళీమోహన్ గురించి మాట్లాడిన మాటలూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల నిర్వహించిన ‘రేవ్ పార్టీ’ ఈవెంట్‌లో ‘మురళీ మోహన్ గారు మంచికి మారు పేరు.. నేను చెడుకు మారు పేరు.
ఒక విషయంలో ఆయన్ను నేను బాగా ద్వేషించేవాణ్ని’ అంటూ వర్మ మాట్లాడటం ప్రారంభించగానే.. అప్పటి వరకు అక్కడ సరదా కబుర్లలో మునిగి తేలిన వారంతా ఒక్కసారిగా చెవులు రిక్కించి వినడం మొదలు పెట్టారు. “నాకు ఇష్టమైన హీరోయిన్లలో జయసుధ ఒకరు. ‘జ్యోతి’ సినిమాలో ఆమె మురళీమోహన్ గారి ఒడిలో కనిపించింది. ఆ సీన్ చూసినప్పుడల్లా నేను కోపంగా థియేటర్ నుంచి బయటకు వెళ్లేవాణ్ని. అందుకే మురళీమోహన్ గారంటే నాకు కోపం” అని వివరించారు వర్మ. ఇంకా ఆర్జీవీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మురళీమోహన్ వ్యక్తిత్వం గురించి చెప్పారు. ‘అయితే, ఆయన లాంటి నాన్ కాంట్రవర్సియల్ పర్సన్‌ను నా లైఫ్‌లో చూడలేదు’ అంటూ పాజిటివ్ వర్డ్స్ చెప్పగానే ఆహూతులంతా ఘొల్లున నవ్వకుండా ఉండలేకపోయారు.