calender_icon.png 6 February, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల సంఖ్య ఎందుకు తగ్గింది?

06-02-2025 12:30:08 AM

  1. కాంగ్రెస్‌కు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచన లేదు
  2. అందుకే బీసీ జనాభాను తక్కువగా చూపారు
  3. అసమగ్ర కులగణనతో పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టిస్తారా?
  4. రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): కులగణనలో లక్షలాది మంది వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించనేలేదని, కానీ తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కులగణనను విజయవంతంగా పూర్తిచేసిందని రాహుల్ గాంధీ లోక్‌సభలో చెప్ప డం పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించడమే అవుతుందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య కోటి 85 లక్షలుగా తేలిందని, రాష్ట్ర జనాభాలో ఇది 51 శాతమని కేటీఆర్ గుర్తు చేశారు. ఇక మైనారిటీల్లోని బీసీలను కలిపితే ఏకంగా 61 శాతానికి చేరిందని స్పష్టంచేశారు. అలాంటిది కాంగ్రెస్ సర్కార్ కులగణన సర్వేలో బీసీల జనాభా కోటి 64 లక్షలకు ఎలా తగ్గి, 46 శాతానికి ఎలా పడిపోయిందో చెప్పాలని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు.

ఈ మేరకు బుధవారం లేఖ రాశారు. దశాబ్దకాలంలో బలహీనవర్గాల జనాభా తగ్గినట్టు చూపిన ఈ తప్పుడు లెక్కలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని కేటీఆర్ స్పష్టంచేశారు. అసమగ్రంగా జరిగిన సర్వే పూర్తయినట్టు సాక్షాత్తూ దేశ అత్యున్న త చట్టసభలో రాహుల్ పేర్కొనడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని వాపోయారు.

అసెంబ్లీ సమావేశాల సాక్షిగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్ధేశం కాంగ్రెస్‌కు లేదనే విషయం తేలిపోయిందని చెప్పారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి, చివరకు పార్టీపరం గా మాత్రమే సీట్లు ఇస్తామని చేతులెత్తేయడం మోసం కాకపోతే మరేంటని నిలదీశారు. కాంగ్రెస్ ద్రోహాన్ని చూస్తూ ఊరుకునేందుకు తెలంగాణ బీసీ సమాజం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు.

అగ్రవర్ణాల జనాభా ఎలా పెరిగింది?

తెలంగాణలో అమలు చేయని హామీలను, ఇక్కడి ప్రజలకు అందిస్తున్నట్టు ఎలా ప్రచారం చేసుకుంటారని రాహుల్ గాంధీని కేటీఆర్ నిలదీశారు. ఈ కులగణన సర్వేను కూడా ఇతర రాష్ట్రాల్లో వాడుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే పార్లమెంట్‌లో రాహుల్ ఈ అంశాన్ని ప్రస్తావించారని మండిపడ్డారు.

కులగణనలో దొర్లిన దారుణ తప్పులను సవరించాల్సిన బాధ్యతను మరిచి, బంతిని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలోని బీసీ సంఘాల నేతలు ఏకంగా కులగణన నివేదికను చించేసి నిరసన తెలిపారని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన తప్పులత డక అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేముంటుందని అన్నారు.

ఈ సర్వేతో బీసీలకు న్యాయం జరగక పోగా.. తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లలో అగ్రవర్ణాల జనాభా పెరిగి, బీసీల జనా భా తగ్గడం.. ఎలా సాధ్యమైందో చెప్పగలరా అని రాహుల్ గాంధీని లేఖలో కేటీఆర్ ప్రశ్నించారు. వెనకబడిన వర్గాల భవిష్యత్తును నిర్ధేశించే కీలకమైన కోటాను తప్పులకుప్పగా తయారుచేయడం, కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఉన్న నిలువెత్తు నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కులగణనలో చూపిన ఈ తప్పుడు లెక్కల కారణంగా రానున్న రోజుల్లో ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కోల్పోయే ప్రమాదం పొంచిఉందని బీసీ బిడ్డలు ఆందోన వ్యక్తం చేస్తుంటే, వాస్తవాలు తెలుసుకోకుండా రాహుల్ గాంధీ మాట్లాడటం దారుణమన్నారు. ఎన్నికల ముందు ఒక మాట..

అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడే కాంగ్రెస్ నిజస్వరూపం ఏడాది కాలంగా అనేక రూపాల్లో బయటపడిందని, బీసీల జనాభాను తగ్గించి చారిత్రక తప్పిదం చేసిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ బీసీ సమాజం ఎన్నటికీ క్షమించదన్నారు. తెలంగాణలోని బీసీలకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.