calender_icon.png 30 October, 2024 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులపై వేధింపులెందుకు?

12-07-2024 12:56:13 AM

టెన్త్, ఇంటర్ బోర్డులను ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): విద్యార్థి పేరు మార్చుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినా దానికి అనుగుణంగా విద్యార్హతలపై నూతన సర్టిపికెట్లు జారీ చేయకుండా ఎందుకు వేధింపులకు గురిచేస్తారంటూ ఇంటర్, పదో తరగతి బోర్డు, ఉస్మానియా యూనివర్సిటీలను గురువారం హైకోర్టు ప్రశ్నించింది. పేరు మార్పునకు అంగీకరిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినపుడు కొత్త పేరుతో సర్టిఫికెట్లను జారీ చేయడంలో వచ్చే నష్టమేమిటని ప్రశ్నించింది. ఇందులో నిబంధనల పేరుతో కౌంటర్లు దాఖలు చేయడానికి తీసుకునే చర్యల కంటే కొత్త పేరుతో సర్టిఫికెట్లు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. పేరును మార్చుకోవడాన్ని అనుమతిస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసినా దానికి అనుగుణంగా సర్టిఫికెట్లు సవరించి ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ హయత్‌నగర్‌కు చెందిన మధుసూదన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.

దీనిపై చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తన పేరు మార్పుపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినా సర్టిఫికెట్లలో పేరు మార్చడానికి అడ్డంకిగా ఉన్న నిబంధనలను రద్దు చేయాలని కోరారు. ఇంటర్మీడియట్ బోర్డు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఒకసారి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత అదే పేరు అమల్లోకి వస్తుందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రస్తుతం అన్ని కోర్సులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని, పేరు మారిందన్న కారణంగా దరఖాస్తును తిరస్కరిస్తే ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించింది. కౌంటరు దాఖలు చేయడం కంటే విద్యార్థి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.