కాలుష్యం తీవ్రస్థాయికి చేరాక స్టేజ్ ఆంక్షలు విధిస్తారా?
కోర్టు అనుమతి లేకుండా వాటిని తొలగించవద్దు
ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపాటు
న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత తీవ్రంగా క్షీణించడంపై సుప్రీంకోర్టు మండిపడింది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినప్పటికీ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (ఏఆర్‌ఏపీ) ఆంక్షలు అమలు చేయడంలో ఆలస్యం ఎందుకు జరిగిందని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన నాలుగో దశ ఆంక్షలను కోర్టు అనుమతి లేకుండా తొలగించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ప్రస్తుత చర్యలతో ఏక్యూఐ 400 దిగువకు చేరినా ఆంక్షలను కొనసాగించాలని తేల్చిచెప్పింది. ఢిల్లీ కాలుష్య తీవ్రతపై సోమవారం విచారించిన జస్టిస్ అభయ్ ఓఖా, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం.. కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కాలుష్యంపై రాజకీయ దుమారం
ఢిల్లీలో కాలుష్య తీవ్రత పెరుగుతున్న వేళ ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. గత పదేళ్లుగా రాజధాని ప్రజలు ఆప్ పాలనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఆరోపించారు. కాలుష్య నివారణకు ఆప్ ప్రభుత్వం కృషి చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని, ఏడాది పొడవునా చర్యలు తీసుకో వాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా పంట వ్యర్థాలను తగలబెడుతున్న పంజాబ్, హర్యానా ప్రభుత్వాలతో ఆప్ సర్కార్ సంప్రదించడం లేదని మండిపడ్డారు.
కాగా, ఢిల్లీ కాలుష్య సమస్యపై కేంద్రం రాజకీయం చేస్తోందని సీఎం అతిశీ విమర్శించారు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటవ్యర్థాల కాల్చివేతపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పంజాబ్ వ్యర్థాల కాల్చివేత గణనీయంగా తగ్గించిందని, కానీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇది కొనసాగుతోందని ఆరోపించారు.
40 సిగరెట్లతో సమానం
ఢిల్లీలో సోమవారం ఉదయం 7 గంటలకు గాలి నాణ్యత మరింత దిగజారి 483గా నమోదైంది. దీన్ని అతి తీవ్రమైనదిగా అధికారులు చెబుతున్నారు. ఈ స్థాయి రోజుకూ 40 సిగరెట్ల తాగడంతో సమానమని విశ్లేషకులు చెబుతున్నారు. కాలిందీ కుంజ్ ప్రాంతంలో యమునా నదిలో హానికారక నురగ తేలుతూ కనిపించింది. ఢిల్లీవాసులు శ్వాస తీసుకోవడానికి సైతం ఇబ్బంది పడుతున్నారు. కొందరు కళ్లలో మంట, చికాకుగా ఉందని, మరికొందరు దగ్గు, జలుబు వేధిస్తున్నానయని ఫిర్యా దు చేస్తున్నారు. ఢిల్లీవ్యాప్తంగా దట్టమైన పొగమంచు కప్పేయడంతో రైళ్లు, విమానాల రాక పోకలకూ అంతరాయం ఏర్పడింది. తక్కువ వెలుతురు కారణంగా 11 విమానాలను దారి మళ్లించారు. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.