పాలస్తీనాపై అందరూ మాట్లాడతారు: పవన్ కల్యాణ్
అమరావతి, నవంబర్ 27: ఇస్కాన్ ప్రచారకులు చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. హిందువులను లక్ష్యంగా చేసుకున్న తీరు తీవ్రంగా కలచివేస్తోందని బుధవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు.
పాలస్తీనాలో ఏదైనా జరిగితే అందరూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తారనీ అదే బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటే ఏ ఒక్కరూ స్పం దించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని బంగ్లా ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్‌కు విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైన్యం తమ రక్తాన్ని చిందించిందని గుర్తు చేశారు. ఎంతో మంది ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.