నిమ్స్‌లో విద్యార్థికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో పదిరోజులకో పసి బిడ్డ ప్రాణాలు పోతున్నా.. ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తా రు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు మరణించిన 42 మంది పిల్లల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ, ఆమె కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత శనివారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న పసిబిడ్డల ప్రాణాలను ప్రాధాన్యత గల అంశంగా స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. సంక్షేమ శాఖలన్నీ ముఖ్యమంత్రి వద్దే ఉన్నా పిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందన్నారు.