25-04-2025 01:24:02 AM
బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఉగ్రదాడిని సైతం రాజకీయకోణంలోనే చూస్తోందని, ఆ పార్టీ దివాళాకోరుతనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ్య సభ్యు డు డా. కే లక్ష్మణ్ మండిపడ్డారు. గురువారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాప సూచకంగా మౌనం పాటించారు.
అనంతరం మీడియాతో లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశమై భద్రత, నిఘా వైఫల్యాల వల్లే ఉగ్రదాడి జరిగిందని ఆరోపించిందని, ఈ విషయాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని కేసీ వేణుగోపాల్ విమర్శించడం సిగ్గుచేటన్నారు. పహల్గాం ఘటనలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. నరరూప రాక్షసుల్లా వ్యవహరించారని.. ఉగ్ర దాడికి కర్త కర్మ క్రియ పాకిస్థానే అని ప్రపంచమంతా కోడై కూస్తున్నదన్నారు.
కాంగ్రెస్ మాత్రం ఆ దేశాన్ని నిందించకపోగా, ముందు నుంచే ఎనలేని ప్రేమ కురిపిస్తోందని మండిపడ్డారు. పహల్గాం ఘటనను హిందువులపై జరిగిన దాడిగా కాంగ్రెస్ భావించడం లేదని.. ఇస్లాం, జీహది ఉగ్రవాదం అనడానికి కూడా కాంగ్రెస్‌కు మనస్సు ఒప్పడంలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇంకా ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తోందన్నారు.
రాబర్ట్ వాద్రా ఉగ్రవాదుల చర్యలను సమర్థించేలా వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ మెప్పు కోసమే బీఆర్‌ఎస్ పహల్గాం ఘటనపై నోరు మెదపడం లేదని విమర్శించారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ గెలవాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించా యన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, పార్టీ సంస్థాగత రాష్ర్ట ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, పార్టీ రాష్ర్ట కార్యదర్శి కొల్లి మాధవి తదితరులు పాల్గొన్నారు.