calender_icon.png 5 January, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ ప్రమాణ పత్రాలు ఎందుకివ్వాలి?

04-01-2025 01:33:48 AM

  1. ప్రజాపాలనలో తీసుకున్న ఆరు లక్షల దరఖాస్తులు ఏమైనయి ?
  2. రైతుభరోసా అమలు చేయలేకపోతే రైతులకు క్షమాపణలు చెప్పండి
  3. ‘రైతుబంధు’పై ఆరోపణలను నిరూపించాలి..
  4. దుబారా అయిన నిధుల సంగతి తేల్చాలి..
  5. గ్రామగ్రామాన జాబితాను ప్రదర్శించాలి.. 
  6. కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): “కాంగ్రెస్ అధికారంలోకి వస్తే లేనిపోని హామీలతో బాండ్ పేపర్ రాసిస్తామని బీరాలు పలికారు. ఎన్నికల్లో గెలిచి, అధికార పగ్గాలు చేపట్టి.. ఇప్పుడేమో రైతుభరోసా పథకానికి ప్రమాణ పత్రాలు అడుగుతున్నారు. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్లకు 6 లక్షల దరఖాస్తులు స్వీకరించారు.

మళ్లీ కొత్తగా ప్రమాణ పత్రాలెందుకు? బీఆర్‌ఎస్ హయాంలో అమలైన రైతుబంధు పథకం పరిధిలో రూ.22 వేల కోట్లు పక్కదారి పట్టాయని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపిస్తు న్నారు. వాటిని నిరూపిస్తూ ఏ గ్రామంలో ఎన్ని నిధులు దారిమళ్లాయో జాబితా సిద్ధం చేయాలి. గ్రామగ్రామాన జాబితాను ప్రదర్శించాలి” అని కాంగ్రెస్ పార్టీ నేతలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.

హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనలో శాసించే స్థాయిలో రైతాంగం ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మాత్రం యాచించే పరిస్థితులు వచ్చా యని అభిప్రాయపడ్డారు. రాష్ట్రప్రభుత్వం రైతులను బిచ్చగాళ్లుగా చూస్తున్నదన్నారు.

తమ పాలనలో అర్హత ఉన్న ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం అందించామని, గతంలో ఎన్నడూ లేని విధంగా పోడు రైతులకూ పథకం వర్తింపజేశామన్నారు. తమ ప్రభుత్వం మొత్తం 11 సీజన్లలో రూ.73 వేల కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామని, 12వ సీజన్‌లో ఇవాల్సిన డబ్బులను ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి మరీ కాంగ్రెసోళ్లు ఆపివేశారని గుర్తుచేశారు.

రైతుబంధు దుబారా అయిందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేసినంత మాత్రాన రైతులు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. రైతుభరోసా పథకాన్ని ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. పథకం అమలు చేసే సత్తా లేకుంటే రైతన్నలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆరు గ్యారంటీలు అమలు చేసే సత్తా లేని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుభరోసా అమలు చేసే సత్తా ఎక్కడి నుంచి వస్తుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు దేవుడిపై ప్రమాణాలు చేసి, అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత  రైతుల నుంచి ప్రమాణ పత్రాలు అడుగుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇప్పటికే ఒక్కో ఎకరానికి రూ. 17,500 చొప్పున రూ.26 వేల కోట్లకు పైగా రైతుభరోసా బాకీ పడిందన్నారు.

ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు పథకాన్ని రైతుభరోసాగా కుదించే కుట్రను బీఆర్‌ఎస్ తీవ్రం గా ఖండిస్తున్నదని స్పష్టం చేశారు. సంక్రాంతి లోపు రైతుభరోసాను అమలు చేసేలా ఒత్తిడి తీసుకువస్తున్నామని తెలిపారు.