ఫార్ములా ఈ-కారు రేసు కేసు
ఏస్ నెక్ట్స్ జెన్‌ను ప్రశ్నించిన ఏసీబీ
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): ఫార్ములా ఈ--కారు రేసు నుంచి ఎందుకు తప్పుకున్నారు.. రేసింగ్‌కు సంబంధించి 9వ సీజన్ తర్వాత వైదొలగడానికి కారణం ఏంటి? తదితర ప్రశ్నలతో ఏసీబీ అధికారులు ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థ డైరెక్టర్, ఫస్ట్ ప్రమోటర్ అయిన చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను ప్రశ్నించారు.
ఫార్ములా ఈ--కారు రేసు కేసులో మొదట్లో కీలకంగా ఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థ ప్రతినిధులను ఏసీబీ శనివారం హైదరాబాద్‌లో విచారించింది. సంస్థ డైరెక్టర్ అనిల్‌ను దర్యాప్తు అధికారులు సుమారు రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు.
ఈ కేసులో ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థనే రేసు నిర్వహించాల్సి ఉండగా రేస్‌కు సంబంధించి అనుమతులు పొందేందుకు సమర్పించిన పత్రాలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి వివరాలను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.
9వ సీజన్ రేసు నిర్వహణ అనంతరం ఈ సంస్థ 10వ సీజన్ నిర్వహించాల్సి ఉండగా ఒప్పందం నుంచి తప్పుకునేందుకు, ఒప్పందం నుంచి అర్థాంతరంగా వైదొలగేందుకు ఉన్న కారణాలపై ఏసీబీ లోతుగా ఆరా తీసింది. 9వ సీజన్ కోసం ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం పూర్తి వివరాలను అడిగింది.
మధ్యలోనే వెళ్లిపోయిన ఏస్ నెక్స్ జెన్...
2022 అక్టోబర్ 25న జరిగిన మొదటి ఒప్పందం ప్రకారం సీజన్ 9, 10, 11, 12 రేస్‌ల నిర్వహణ ఖర్చులను ఏస్ నెక్ట్స్ జెన్ భరించాలి. హైదరాబాద్‌లో 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సీజన్-9 ఫార్ములా ఈ--కారు రేస్ జరిగింది. 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్-10 రేస్ కోసం ఫార్ములా -ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో) సంస్థకు 2023 మే లోనే 50 శాతం సొమ్ము రూ.90 కోట్లు చెల్లించాల్సి ఉండగా అందుకు ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థ చెల్లించలేదు.
సీజన్ -9 ఫార్ములా ఈ-కారు -రేసు నిర్వాహణ వల్ల భారీగా నష్టం వచ్చిందని ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ చేతులెత్తేసింది. ఫలితంగా ఈ వ్యవహారంలో ప్రమోటర్‌గా హెచ్‌ఎండీఏనే పూర్తి పాత్ర పోషించాలని అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ తరుణంలో 2023 అక్టోబర్ 5, 11 తేదీల్లో రూ.45.71 కోట్లను ఎఫ్‌ఈవోకు హెచ్‌ఎండీఏ నేరుగా బదిలీ చేసింది.
ఈ వ్యవహారమే ఇప్పుడు, ఈ మొత్తం వివాదానికి తెరలేపింది. కాగా.. ఈ కేసులో ఇప్పటికే ఏ1గా కేటీఆర్, ఏ2 అప్పటి మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్ కుమార్, ఏ3 హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డిలను విచారించిన ఏసీబీ.. ఇప్పుడు బాధ్యతల నుంచి అకస్మాత్తుగా తప్పుకొన్న ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థ మీద బీఆర్‌ఎస్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై దృష్టి పెట్టింది.
ఈ తరుణంలోనే విచారణ కోసం ఏసీబీ ఈ నెల 16న ఈ సంస్థకు నోటీసులు జారీచేసింది. ఇప్పటికే రెండు సార్లు ఏసీబీ నోటీసులు ఇచ్చినా, గైర్హాజరైన ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు శనివారం మధ్యాహ్నం వరకు ఏసీబీ కార్యాలయానికి రాలేదు. అయితే, ప్లుటై ఆలస్యమైందని చెబుతూ ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థ డైరెక్టర్ అనిల్ మధ్యాహ్నం 3 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వచ్చారు.