బీసీలకు జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు ఏండ్ల తరబడి డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్న విషయం జగమెరిగిన సత్యం. బీసీల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నామంటున్న పాలక పార్టీలు జనాభాలో 54 శాతం ఉన్న వారికి చట్ట సభల్లో, స్థానిక సంస్థల్లో జనాభా ప్రాతిపదికన ఎందుకు రిజర్వేషన్లు కల్పించడం లేదు? రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దన్న రాజ్యాంగ నిబంధనను, కోర్టు తీర్పులను సాకుగా చూపి తప్పించుకుంటున్నారు.
బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు అనుకూలమైన చట్టాలను చేస్తున్నప్పుడు రాజ్యాంగం, కోర్టు తీర్పులు అడ్డువస్తే వారికి అనుకూలంగా రాజ్యాంగ సవరణలు చేసి చట్టాలను తీసుకు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీలపై నిజమైన ప్రేమ ఉంటే చట్ట సవరణ చేసయినా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. కానీ పాలక పార్టీలు ఆ పని చేయడం లేదు.
ఎందుకంటే ప్రస్తుత పాలక పార్టీలన్నీ అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయి. అందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుల గణన చేపట్టకపోగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయమైన ఈ విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు జరపాలని 90 శాతం బీసీ కులాలు కోరుతున్నాయి.
చెరుకు సత్యం, హైదరాబాద్