calender_icon.png 30 November, 2024 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహిరంగ ధూమపానం మానరా?

30-11-2024 12:00:00 AM

బహిరంగ ప్రదేశాల్లో పొగతాగకూడదని చట్టం చెబుతున్నప్పటికీ పలువురు దీనికి తూట్లు పొడుస్తున్నారు. ధూమపానం చేసే వారు పక్క వారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చట్టం గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. బహిరంగంగా ధూమపానం చేసే వారికి అధికారులు భారీ జరిమానాలు విధించడంతో పాటుగా కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తే వారు బహిరంగంగా పొగతాగడానికి  వెనకాడుతారు.

దీనివల్ల  చుట్టూ ఉండే స్త్రీలు, వృద్ధులు, చిన్నపిల్లలులాంటి వారికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది.  ఒకప్పుడు రైళ్లలో, బస్సులలో కూడా జనం ఇష్టం వచ్చినట్లు ధూమపానం చేసే వారు. ఇప్పుడు పూర్తిగా కట్టడి అయింది. అలాగే రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలోనూ ధూమపానం చేసే వాళ్లు ఇప్పుడు చాలావరకు తగ్గిపోయారు. ఇది చాలా మంచి పరిణామమే. అయితే ఇప్పటికీ పొగాకు వినియోగం ఏమాత్రం తగ్గక పోవడం గమనార్హం.

గతంలో పొగాకు సాగుపై నియంత్రణ విధించాలన్న డిమాండ్ వచ్చింది కానీ అమలు కాలేదు. ధూమపానం ఆరోగ్యానికి హానికరమనే విషయాన్ని కేవలం సిగరెట్ పెట్టెలపైన, టీవీ యాడ్స్‌లో చూపడం వల్ల పెద్దగా ఫలితం ఉండడం లేదు. బహిరంగ ధూమపానం కట్టడికి  కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.


 షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్