ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపుపై
ప్రభుత్వాన్ని వివరణ కోరిన హైకోర్టు
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లను కుదించి, డిమాండ్ ఉన్న కోర్సుల సీట్ల పెంపునకు నిరాకరించడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏఐసీటీఈ, యూనివర్సిటీలు అనుమతించిన తరువాత ప్రభుత్వం సీట్ల పెంపును నిరాకరించడంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
సీట్ల సర్దుబాటుకు అనుమతి నిరాకరిస్తూ ఈ నెల 24న జారీ చేసిన మెమోతోపాటు రాష్ట్ర ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన సాంకేతిక విద్యాచట్టంలోని సెక్షన్ 20ని సవాలు చేస్తూ మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎంజీఆర్, విద్యాజ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి కాలేజీ, అనురాగ్ ఇంజినీరింగ్ కాలేజీ, తదితర కాలేజీలు వేర్వేరుగా 11 పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది డీ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సుల్లో సీట్లను పెంచుకోవడానికి జేఎన్టీయూ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీచేయగా, ఏఐసీటీఈ అనుమతి మంజూరు చేసిందని గుర్తుచేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనుమతి మంజూరు చేయడంలేదని తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, సాంకేతిక విద్య కమిషనర్, జేఎన్టీయూ, ఏఐసీటీఈ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఈఏపీసెట్ కన్వీనర్లకు నోటీసులు జారీచేస్తూ విచారణను సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.